నయా మోసం.. కాల్‌ఫార్వర్డింగ్‌ ఫిషింగ్‌ | Cyber criminals calling in name of courier companie: Telangana | Sakshi
Sakshi News home page

నయా మోసం.. కాల్‌ఫార్వర్డింగ్‌ ఫిషింగ్‌

Jun 9 2025 4:34 AM | Updated on Jun 9 2025 4:34 AM

Cyber criminals calling in name of courier companie: Telangana

కొరియర్‌ సంస్థల పేరుతో కాల్‌ చేసి వివరాలు సేకరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు 

ఓటీపీ, వెరిఫికేషన్‌ కోడ్‌లు తెలుసుకుని ఫోన్లు హైజాక్‌

కాంటాక్ట్‌ నంబర్లకు డబ్బుల కోసం రిక్వెస్ట్‌లు పంపుతూ మోసం

అప్రమత్తంగా ఉండాలంటున్న టీజీ సైబర్‌ సెక్యూరిటీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కాల్‌ఫార్వర్డింగ్‌ ఫిషింగ్‌ మోసం ఇప్పుడు తెరపైకి వస్తోంది. కొరియర్‌ సంస్థల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసం ఎలా జరుగుతుంది.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలతో టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ ఒక ప్రకటన జారీ చేశారు.  

ఇలా వల వేస్తారు... 
కొరియర్‌ సంస్థల పేరుతో, ముఖ్యంగా బ్లూడార్ట్‌ వంటి సంస్థల పేరిట మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. మీ పేరిట కొరియర్‌ వచి్చందంటూ బాధితులకు కాల్‌ చేస్తారు. మా కొరియర్‌ బాయ్‌ మీకు దగ్గర్లో ఉన్నాడని, లొకేషన్‌ గుర్తులు అవసరమని చెప్పి నమ్మకం కలిగిస్తారు. తర్వాత మీకు పంపిన లింక్‌పై క్లిక్‌ చేయాలని సూచిస్తారు. అలా పంపిన లింక్‌పై క్లిక్‌ చేయగానే ఫోన్‌లో వైరస్‌ను పంపి బాధితుల ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారు. లేదా 21 ఫోన్‌ నంబర్‌ వంటి ప్రత్యేక కోడ్‌ డయల్‌ చేయాలని చెబుతారు.

ఆ తర్వాత ఫోన్‌కాల్‌ ఫార్వర్డింగ్‌ యాక్టివేట్‌ చేస్తారు. కాల్‌ ఫార్వర్డింగ్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత, బాధితుల ఫోన్‌ను మోసగాళ్లు హైజాక్‌ చేస్తారు. ఆ తర్వాత బాధితుల ఫోన్‌కు వచ్చే కాల్స్, ఓటీపీలు, వెరిఫికేషన్‌ కోడ్‌లు తెలుసుకుంటారు. అదేవిధంగా వాట్సాప్‌ సహా అన్ని సోషల్‌ మీడియా యాప్‌లు, ఫోన్‌ గ్యాలరీపైన నియంత్రణ సైబర్‌ మోసగాళ్లకు వెళుతుంది. బాధితుడికి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ సహా ఇతర యాప్‌లేవీ పనిచేయవు. ఇలా బాధితుడి ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లకు బాధితుడిగా నటిస్తూ, వారి కాంటాక్ట్స్‌ లో ఉన్న వ్యక్తులకు మెసేజులు పంపించి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని అభ్యర్థిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడతారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..:  
మీ ఫోన్లో కాల్‌ ఫార్వర్డింగ్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేయండి. 
మీ నెట్వర్క్‌ ప్రొవైడర్‌ను సంప్రదించి కాల్‌ ఫార్వర్డింగ్‌ ఆపేయండి. 
కొరియర్‌ కంపెనీలకు వారి అధికారిక వెబ్‌సైట్లో ఉన్న నంబర్లకే కాల్‌ చేయండి. 
తెలియని లింకులపైన క్లిక్‌ చేయకండి. 

లేదా ఉన్న కోడ్లు డయల్‌ చేయకండి. 
ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దు.  
మీ ఫోన్‌ కాల్‌ సెట్టింగ్స్, బ్యాంక్‌ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.  
ఒకవేళ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కు కాల్‌ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో లేదా సైబర్‌ ఫ్రాడ్‌ రిజిస్ట్రీ 8712672222 వాట్సాప్‌ నంబర్‌లో ఫిర్యాదు చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement