breaking news
Courier company
-
నయా మోసం.. కాల్‌ఫార్వర్డింగ్ ఫిషింగ్
సాక్షి, హైదరాబాద్: కాల్‌ఫార్వర్డింగ్ ఫిషింగ్ మోసం ఇప్పుడు తెరపైకి వస్తోంది. కొరియర్ సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఈ తరహా మోసం ఎలా జరుగుతుంది.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న అంశాలతో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇలా వల వేస్తారు... కొరియర్ సంస్థల పేరుతో, ముఖ్యంగా బ్లూడార్ట్ వంటి సంస్థల పేరిట మోసగాళ్లు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. మీ పేరిట కొరియర్ వచి్చందంటూ బాధితులకు కాల్ చేస్తారు. మా కొరియర్ బాయ్ మీకు దగ్గర్లో ఉన్నాడని, లొకేషన్ గుర్తులు అవసరమని చెప్పి నమ్మకం కలిగిస్తారు. తర్వాత మీకు పంపిన లింక్‌పై క్లిక్ చేయాలని సూచిస్తారు. అలా పంపిన లింక్‌పై క్లిక్ చేయగానే ఫోన్లో వైరస్‌ను పంపి బాధితుల ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుంటారు. లేదా 21 ఫోన్ నంబర్ వంటి ప్రత్యేక కోడ్ డయల్ చేయాలని చెబుతారు.ఆ తర్వాత ఫోన్‌కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేస్తారు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయిన తర్వాత, బాధితుల ఫోన్‌ను మోసగాళ్లు హైజాక్ చేస్తారు. ఆ తర్వాత బాధితుల ఫోన్‌కు వచ్చే కాల్స్, ఓటీపీలు, వెరిఫికేషన్ కోడ్లు తెలుసుకుంటారు. అదేవిధంగా వాట్సాప్ సహా అన్ని సోషల్ మీడియా యాప్‌లు, ఫోన్ గ్యాలరీపైన నియంత్రణ సైబర్ మోసగాళ్లకు వెళుతుంది. బాధితుడికి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సహా ఇతర యాప్‌లేవీ పనిచేయవు. ఇలా బాధితుడి ఫోన్లోని కాంటాక్టు నంబర్లకు బాధితుడిగా నటిస్తూ, వారి కాంటాక్ట్స్ లో ఉన్న వ్యక్తులకు మెసేజులు పంపించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని అభ్యర్థిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడతారు.ఈ జాగ్రత్తలు పాటించండి..: ⇒ మీ ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి. ⇒ మీ నెట్వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించి కాల్ ఫార్వర్డింగ్ ఆపేయండి. ⇒ కొరియర్ కంపెనీలకు వారి అధికారిక వెబ్సైట్లో ఉన్న నంబర్లకే కాల్ చేయండి. ⇒ తెలియని లింకులపైన క్లిక్ చేయకండి. ⇒ లేదా ఉన్న కోడ్లు డయల్ చేయకండి. ⇒ ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోవద్దు. ⇒ మీ ఫోన్ కాల్ సెట్టింగ్స్, బ్యాంక్ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ⇒ ఒకవేళ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ 8712672222 వాట్సాప్ నంబర్లో ఫిర్యాదు చేయండి. -
రవాణా ఛార్జీలు పెంపు!
ప్రముఖ కొరియర్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ రవాణా ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. 2025 జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటనలో స్పష్టం చేసింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాలు, ఇన్పుట్ ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా దీర్ఘకాలిక వ్యయాలు అధికం అవుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఉన్న రవాణా ఛార్జీలను దాదాపు 9-12 శాతం పెంచాలని నిర్ణయించారు. జనవరి 1, 2025 నుంచి ఈ ధరల పెంపు అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యుయెల్ మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి, వారికి మరింత సమర్థంగా సేవలందించేందుకు ఈ ధరల పెంపు చాలా అవసరం. ఇది కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, అధునాతన సాంకేతికతలను ఉపయోగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: యూఎస్ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు -
గరుడవేగ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ షిప్పింగ్ సర్వీసెస్
హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేయటానికి గరుడవేగ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడ కొనుగోలు చేసినా వాటిని ఇండియాలోని తమ వారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే తమను సంప్రదించాలని (www.garudavega.com) గరుడవేగ సంస్థ ప్రకటించింది. ఏ విధమైన లాభాలు ఆశించకుండా, ఆ సిలెండర్లు పంపటానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతే సొమ్ము తీసుకుని, మీవారికి ఆ సిలెండర్లు అందిస్తామని గరుడవేగ తెలిపింది. పేలెట్ కార్గో/కమర్షియల్ షిప్మెంట్లు చేయదలుచుకున్నవారు oxygen@garudavega.comకు ఈమెయిల్ చెయవచ్చు. గరుడవేగ కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా అమెరికా నుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు తమ సేవలు అందుతాయని గరుడవేగ తెలిపింది. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసుతో పాటు మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం.. కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ తో బాటు, రెండువందల దేశాలకు షిప్పింగ్ సేవలు అందిస్తున్నట్టు గరుడవేగ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. -
లక్షల విలువ చేసే దుస్తులు మాయం
బంజారాహిల్స్ : విలువైన దుస్తులు మాయం చేశారంటూ ప్రముఖ డిజైనర్ ఓ కొరియర్ సంస్థపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..బంజారాహిల్స్ రోడ్ నెం. 10లో ప్రముఖ డిజైనర్ సుమన్ షరాఫ్ అంగసూత్ర డిజైనరీ షోరూం నిర్వహిస్తున్నారు. ఆమె ఈ నెల 12న ఆమె వైజాగ్‌లోని తమ బొటిక్కు ఇక్కడి నుంచి బి–4 లాజిస్టిక్స్ కొరియర్స్ నుంచి 9 పార్శిల్స్‌ను పంపించారు. ఈ పార్శిల్స్‌ను కొరియర్ బాయ్ శివరాం తీసుకున్నాడు. ఈ నెల 13న పార్శిల్ వైజాగ్‌కు చేరుకోగా పార్శిళ్లను విప్పి చూడగా అందులో ఖరీదైన తొమ్మిది డిజైనరీ దుస్తులు కనిపించలేదు. వీటి విలువ రూ. 4.4 లక్షలు ఉంటుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోపేర్కొన్నారు. ఈ మేరకు బీ–4లాజిస్టిక్స్ కొరియర్స్, కొరియర్ బాయ్ శివరాంపై ఐపీసీ సెక్షన్ 406,420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నెట్’ ఇంటి నుంచి... నట్టింట్లోకి...
ఏటా రూ.3వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ కావాలంటూ అమ్మానాన్నలకు ప్రణవ్ అప్లికేషన్... నిన్న ఓ టీవీ షోలో చూసిన న్యూ లుక్ డ్రెస్ కోసం సింధుజ తన మామయ్య రాకేష్ వద్ద గారాలు... ఓ కార్టూన్ చానెల్లోని బుజ్జిపాప పట్టుకున్న స్కూల్ బ్యాగ్ లాంటిదే తనకూ కావాలని చిన్నారి శ్రీహిత మారాం. అప్పుడెప్పుడో ఓ షాపులో చూసిన ఖరీదైన ల్యాప్‌టాప్‌కు భారీగా డి స్కౌంట్ అంటూ అదే సమయంలో రాకేష్‌కు సురేష్ ఫోన్. కొత్త డిజైన్ జ్యువెలరీ బాగుందని... అది కొంటే... రాగిణి ఇంట్లో జరిగే శుభకార్యానికి వేసుకోవచ్చని భర్త కరుణాకర్‌కు రాజేశ్వరి దరఖాస్తు...ఉన్నది ఒక్క ఆదివారమే. సమయమూ సరిపోదు. ఒకే రోజు...ఒకేసారి అందరికీ అన్ని వస్తువులూ కొనడమంటే తలకుమించిన పనే... సింధుజ సలహాతోఅంతా కలసి ఇంట్లోని కంప్యూటర్ ముందు వాలిపోయారు. ‘నెట్’ ఇంట్లోకి వెళ్లారు. నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారు... అరగంటలో మొత్తం షాపింగ్ పూర్తయిపోయింది. అదీ ఆన్లైన్ మార్కెట్ మహిమ. * ఇంటి ముంగిటికే సమస్తం * ఆటవస్తువుల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు ఆన్లైన్ లోనే.. * నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ షాపింగ్ * మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులదే సింహభాగం * కొరియర్ సంస్థలకూ ఆదాయం * వేలాది మందికి ఉపాధి సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ మార్కెటింగ్... ఓ సరికొత్త షాపింగ్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. కాలాన్నీ... డబ్బునూ... శ్రమనూ తగ్గిస్తోంది. కావాల్సిన వస్తువులన్నీ రోజుల వ్యవధిలో మన కళ్ల ముందుకు తీసుకువస్తోంది. అది కూడా ఎలాంటి తేడా లేకుండా. ఎంతో నమ్మకంగా. మార్కెట్ ధర కంటే తక్కువగా. అందమైన దుస్తులు మొదలుకొని... స్మార్ట్ఫోన్లు, నచ్చిన పుస్తకాలు... పిల్లల ఆటవస్తువులు... ఒకటేమిటి... కోరుకున్న ఏ వస్తువైనా క్షణాల్లో కొనేసే సదుపాయం ఇప్పుడు ‘క్లిక్’ దూరంలో ఉంది. మన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన ఇంటర్నెట్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను సైతం మన ముంగిట్లో నిలుపుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో షాపింగ్‌కు వెళ్లే తీరిక... ఓపిక లేనివారికి ఇది ఓ వరంగా మారిందనడంలో సందేహం లేదు. నగరం దృష్టిని ఆన్లైన్ మార్కెట్ తొందరగానే తనవైపు తిప్పుకుంది. సాఫ్ట్వేర్ నిపుణులు, ఉన్నతోద్యోగులే కాదు... సగటు వేతన జీవులు... గృహిణులు... విద్యార్థులు సైతంవస్తువుల కోసం ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. నగరంలో కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల వద్ద పెద్ద పెద్ద బ్యాగులు భుజాన వేసుకొని కోరుకున్న వస్తువులను ఇంటి ముందుకు తెచ్చిచ్చే డెలివరీబాయ్‌ల చేతుల్లో అత్యధికం ఆన్లైన్ మార్కెటింగ్ వస్తువులే. హైదరాబాద్ నగరంలో ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం జరుగుతోందని మార్కెట్ నిపుణుల అంచనా. స్మార్ట్ఫోన్లు, దుస్తులదే అగ్రస్థానం.. నగర వాసులు ఎక్కువగా ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే కొంత తక్కువ ధర... నాణ్యత, సేవలు సంతృప్తికరంగా ఉండడంతో చాలామంది ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత బ్రాండెడ్ దుస్తులది రెండో స్థానం. ఇక పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలు, గృహోపకరణాలు తరువాతి స్థానాల్లో ఉం టున్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక ఆన్లైన్ మార్కెట్ కలిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు తాము అందజేసే వివిధ రకాల వస్తువులపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రూ.3,500నుంచి రూ.5 వేల వరకు ఉండే బ్రాండెడ్ షూపైనా ఆన్లైన్ మార్కెట్లో 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ దుస్తులపై కూడా 40 నుంచి 50శాతం డిస్కౌంట్ ఉంటోంది. మార్కెట్లో రూ.800కు లభించే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఆన్లైన్లో రూ.550 కే లభించడం విశేషం. ఎనిమిది గంటల పాటు విద్యుత్ సదుపాయం ఉండే సోలార్ లై ట్ ఆన్లైన్లో రూ. 1,400కే దొరుకుతోంది. ఇలా సగటు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ధరల్లో వస్తువులు లభించడంతో అందరూ ఆన్లైన్ బాటలో నడుస్తున్నారు. 67 శాతం కొనుగోళ్లతో ఢిల్లీ మొదటి స్థానంలో, 60 శాతంతో ముంబయి రెండోస్థానంలో, 50శాతంతో బెంగళూర్ మూడో స్థానం లో ఉండగా, 40 శాతం ఆన్లైన్ మార్కెట్‌తో హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో తమ స్థానాన్ని పదిలపరచుకునేందుకు ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్, అరవింద్, లైఫ్ స్టైల్, వాల్‌మార్ట్, గోద్రెజ్ వంటి సంస్థలూ ఆన్లైన్ ఆర్డర్లకు శ్రీకారం చుట్టాయి. యువతకు ఉపాధి... సాఫ్ట్వేర్ నిపుణులు, మేనేజ్మెంట్ గురూలు మొదలుకొని వినియోగదారుల ఇంటి వద్దకు వచ్చి వస్తువులను అందజేసే డెలివరీ బాయ్స్ వరకు వేలాది మందికి ఆన్లైన్ మార్కెటింగ్ అద్భుతమైన ఉపాధి నిస్తోంది. ‘ఆన్లైన్ షాపింగ్ యాజమాన్యాలు, పోర్టళ్లకు యువతే మహారాజులు. వారిలోని నైపుణ్యాలను, సృజనాత్మకతను అంచనా వేసి సముచితమైన ప్రాధాన్యం ఇస్తున్నా’ మని ఈబే బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ హెడ్ వివేక్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం నగరంలో అన్ని ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్ల ఉద్యోగుల సంఖ్య 20 వేలపైనే ఉంది. డెలివరీ సిబ్బంది, కస్టమర్ సర్వీస్, వెబ్ యాప్ డెవలపర్లు, క్వాలిటీ నిపుణులు, కంటెంట్ రచయితలు, గ్రాఫిక్ డి జైనర్లు వంటి విభాగాల్లో పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రవాసులు సైతం... నగరంలోని తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు పంపించాలనుకునే ఎన్నారైలు సైతం ఇప్పుడు ఆన్లైన్నే ఎంచుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లోని తమ ఆప్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజుల వంటి శుభకార్యాలకు నగరానికి చెందిన వందలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు బహుమతులు పంపించేందుకు ఆన్లైన్ మార్కెట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ఆన్లైన్ బిజినెస్ ద్వారా డెలివరీ అవుతున్న వస్తువుల్లో ఎన్నారైల వాటా 25 శాతం ఉంటుందని కొరియర్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. కొరియర్ సంస్థలకూ వరం ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులను కొరియర్ సర్వీస్ ద్వారా సంబంధిత సంస్థలు వినియోగదారులకు చేరవేస్తున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు సొంతంగా కొరియర్ సంస్థలను కలిగి ఉంటే... మరి కొన్ని ఇతర కొరియర్ సంస్థలపైన ఆధార పడుతున్నాయి. దీంతో కొరియర్ సంస్థల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాపార రంగంలో హైదరాబాద్ 25 శాతం వాటా కలిగి ఉన్నట్లు అంచనా. నగరంలో వెయ్యికి పైగానే కొరియర్ సంస్థలు సేవలందిస్తున్నాయి. వీటిలో అరామెక్స్ ఇండియా, బ్లూ డాట్ ఎక్స్‌ప్రెస్, కాంటినెంటల్, డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, లాజిస్టిక్స్ వరల్డ్ వైడ్, ఫ్లయిట్ కొరియర్, ఓవర్ నైట్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు అనేకం ఉన్నాయి. వినియోగదారుల సంతృప్తే కీలకం ప్రతి రోజు 25 నుంచి 30 వస్తువులు అందజేస్తున్నాం. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో 50 వస్తువుల వరకు డెలివరీ అవుతాయి. శని, ఆది వారాలు మినహా మిగతా రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆలస్యమవుతుంది. ముఖ్యంగా బర్త్‌డే పార్టీలు, నచ్చిన వాళ్లకు బహుమతులు అందజేసే సమయాల్లో వినియోగదారుల నుంచి లభించే ప్రశంసలు మాకు కొండంత బలాన్ని ఇస్తాయి. పదోతరగతి చదువుకున్న నాలాంటి ఎంతోమందికి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఉపాధినిస్తోంది. నెలకు రూ.10 వేల దాకా జీతం లభిస్తుంది. - సురేష్‌బాబు, అమెజాన్ డెలివరీ బాయ్ క్లిక్‌తో అన్నీ ఇంటికే... నాకు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నా. దుస్తుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇలా చాలా వస్తువులు ఆన్లైన్లోనే కొన్నా. ఇంట్లో నుంచి కదలకుండా ఒక్క మౌస్ క్లిక్‌తో ఏదైనా కొనుక్కోవచ్చు. పైగా ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో చూసుకుని మనకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. - పి.మానస, విద్యార్థిని సమయం, డబ్బూ ఆదా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆన్లైన్ షాపింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. షాపింగ్‌కు వెళ్లి గంటల తరబడి తిరిగి అలసిపోయే పరిస్థితి ఉండదు. దర్జాగా ఇంట్లో కూర్చుని కావాల్సిన వస్తువులకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్ ధరల కంటే తక్కువకే లభిస్తాయి. ఎక్కువ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఆన్లైన్ షాపింగ్‌లో వివిధ ఆఫర్స్‌తో పాటు క్రెడిట్ కార్డు ఉపయోగించినపుడు రాయితీలు ఇస్తున్నారు. - వై. కిరణ్, చార్టెడ్ అకౌంటెంట్ ఆకర్షణీయమైన ఆఫర్లు... ఇటీవల ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. వీటికి సంబంధించిన వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. పండుగల సందర్భంలో భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు ఇవ్వడం వంటివి బాగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే లభిస్తుందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? ఈఎంఐ సౌకర్యం కూడా ఉండటంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. - మల్లీశ్వరి, గృహిణి