రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలి | CS orders review with top officials on state formation celebrations | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలి

May 23 2025 4:38 AM | Updated on May 23 2025 4:38 AM

CS orders review with top officials on state formation celebrations

ప్రతిశాఖ నుంచి ఒక నోడల్‌ అధికారిని నియమించండి

ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎస్‌ ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో సీఎస్‌ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. 

ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్‌ అధికారిని నియమించి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరేడ్‌ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్‌ రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాటర్‌ ప్రూఫ్‌ షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. 

సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని దీంతో పాటు జనరేటర్‌ బ్యాకప్‌ సైతం ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖకు సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్‌ టెలికాస్ట్‌ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. సమీక్షలో డీజీపీ జితేందర్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ హరీశ్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement