1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు | Crop area increases in Telangana | Sakshi
Sakshi News home page

1.31 కోట్ల ఎకరాల నుంచి 2.38 కోట్ల ఎకరాలకు

Published Sun, Jun 2 2024 6:03 AM | Last Updated on Sun, Jun 2 2024 6:03 AM

Crop area increases in Telangana

పెరిగిన సాగు విస్తీర్ణం

ధాన్యం ఉత్పత్తి కూడా 68 లక్షల టన్నుల నుంచి 2.30 కోట్ల టన్నులకు...

తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో 2014–15లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న పంటల సాగువిస్తీర్ణం 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే పదేళ్ల కాలంలో కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. సాగు విస్తీర్ణం పెరగడంతో పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో 1.50 కోట్ల టన్నుల నుంచి 3.62 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే పంట ఉత్పత్తి 2014తో పోలి్చతే ఏకంగా 137 శాతం పెరగడం గమనార్హం.

వరిసాగులో దేశంలో అగ్రగామిగా నిలిచింది. 2014–15లో 35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు కాగా, 2022–23లో ఇది ఏకంగా 121 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 86 లక్షల ఎకరాల్లో వరి సాగు పెంపు కారణంగా, ధాన్యం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. 2014–15లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, 2022–23 నాటికి ఇది 2.60 కోట్ల టన్నులకు పెరిగింది.  – సాక్షి, హైదరాబాద్‌

రూ.75 వేల కోట్లు రైతుబంధు కింద జమ  
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతులకు అందించారు. ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖా­తా­లోనే జమ చేశారు. ప్రతి సీజన్‌లో సుమారు 65 లక్షల మందికి రూ.7,500 కోట్ల వరకు అందించేవారు. ఈ విధంగా ఇప్పటివరకు మొత్తం రూ. 75 వేల కో­ట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాంగ్రెస్‌ ప్రభు­త్వం  రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది.  

కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వివిధ కారణాలతో మరణించిన సుమారు 1.15 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల పరిహారాన్ని అందించింది.  

లక్ష రుణమాఫీ
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది.  ఇందులో భాగంగానే తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. లక్ష వరకు రుణమాఫీ చేసిన కేసీఆర్‌ సర్కారు.. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూ.లక్ష మాఫీకి హామీ ఇచ్చింది. ఇందులో 2014లో తొలిసారి 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది.

ఇక రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 23 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయగా, మరో రూ. 6 వేల కోట్ల రుణాల మాఫీ పెండింగ్‌లో ఉంది. ఎన్నికల కోడ్‌ రావడంతో అడ్డంకి ఏర్పడింది.  ఇప్పుడు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దాదాపు రూ. 35 వేల కోట్లు అవసరమవుతాయని అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement