రామోజీపై భూకబ్జా కేసు పెట్టాలి.. ఆ 70 ఎకరాలు..

CPM Demanded land grab case registered against Ramoji Rao - Sakshi

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ డిమాండ్‌

70 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారని ఆరోపణ

అవి వైఎస్‌ఆర్‌ హయాంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు

ఆయా స్థలాలను పరిశీలించిన సీపీఎం బృందం

సాక్షి, ఇబ్రహీంపట్నం రూరల్‌: నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కాజేసి, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రామోజీ ఫిలింసిటీ యజమాని రామోజీరావుపై భూ కబ్జా కేసు నమోదు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధి నాగన్‌పల్లి సర్వే నంబరు 189లో 2007లో దివంగత సీఎండాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేదలకు పంపిణీ చేసిన ఫిలింసిటీలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాలను, హద్దు రాళ్లను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్‌వెస్లీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం శుక్రవా రం పరిశీలించింది. అనంతరం జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కబ్జా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఫిలింసిటీలోని ప్రభుత్వ భూముల్లో 650మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

పేదల స్థలాలు కబ్జా చేసి..సెట్టింగులా?
స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తే వాటిని నిర్మించకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారని జాన్‌వెస్లీ మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాల్లో సినిమా షూటింగ్‌ షెడ్లు, సెట్టింగులు అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. పాలకులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రామోజీకి ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి రామోజీతో ఏం లాలూచీ ఉందని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరారు. లేదంటే ఆయా భూములను తామే ఆక్రమించి వాటిలో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుతో పాటు 70 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. 60 గజాల్లో గుడిసెలు వేస్తే పేదలపై కేసులు పెట్టే ప్రభుత్వాలు రామోజీని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. డబ్బులు ఉన్నవాడికి ఊడిగం చేయడం తగదనీ, కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోకపోతే గుడిసెలు వేసి ఆక్రమిస్తామని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే: సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్‌
అక్రమ నిర్మా ణాలను వెంటనే తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే భూములను ఆక్రమించి పొజిషన్‌ తీసుకుంటామని హెచ్చరించారు. నడకబాటలో ఉన్న రోడ్డు వెంట ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. రామోజీ పలుకుబడి ఉపయోగించి కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సామేలు, డి.జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top