పోలీస్ పహారాను దాటుకొని జీవీఎంసీలోకి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు
కనీస చర్చ లేకుండానే ‘గీతం’ కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం
విశాఖ నడిబొడ్డున రూ.5 వేల కోట్ల విలువైన భూమిని
తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు
రెచ్చిపోయిన కూటమి పార్టీల కార్పొరేటర్లు
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి.. పలువురికి తీవ్ర గాయాలు
వెళ్లిపోండంటూ బెదిరింపులు.. మెడపట్టి తోసివేతలు
మహిళా కార్పొరేటర్లపైనా రెచ్చిపోయిన పచ్చ మూకలు సీపీఎం, సీపీఐ సభ్యులపైనా దౌర్జన్యం
నేరుగా దాడికి తెగబడ్డ మేయర్, కూటమి కార్పొరేటర్లు
మీడియాకు నో ఎంట్రీ.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల రంగ ప్రవేశం
తానే అజెండా అంశాలను చదివి ఆమోదించినట్టు మేయర్ ప్రకటన
విశాఖ నగర పాలక సంస్థ సమావేశంలో నిబంధనలకు చరమ ‘గీతం’
చివరి కౌన్సిల్ భేటీలో లోకేశ్ తోడల్లుడు, ఎంపీ భరత్‌కు భూముల పందేరం
రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల కబ్జా భూమి గీతం పరం
‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు.. నోరు మూసుకుని బయటకు వెళ్లిపోండి.. లేదంటే ఇబ్బంది పడతారు..’ అంటూ అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు బరితెగించి బెదిరింపులు.. మెడ పట్టుకుని తోసేయడాలు.. స్వయానా మేయర్ రౌడీ అవతారం ఎత్తి దౌర్జన్యం చేయడం.. ఆయనే అజెండాలోని అంశాలు చదివి.. ఆయనే ఆమోదించడం.. అందరూ ఆమోదించారని ఏకపక్షంగా ప్రకటించడం.. మొత్తంగా జీవీఎంసీలో నిబంధనలకు చరమ ‘గీతం’ పాడటం విస్తుగొలుపుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ, బాలకృష్ణ చిన్న అల్లుడు, లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థ విశాఖ నడిబొడ్డున కబ్జా చేసిన రూ.5 వేల కోట్ల విలువ చేసే 54.79 ఎకరాల భూములను క్రమబద్ధీకరించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలుగా బరి తెగించింది. ఆ భూములను తమ కుటుంబపరం చేసుకునే తీర్మానం చేయించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులను కౌన్సిల్ హాలులోకి పిలిపించింది. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగి ఫక్తు రౌడీ ప్రభుత్వంలా వ్యవహరించింది.
సమావేశం వివరాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియాపై నిషేధం విధించింది. ఇలా అన్ని విధాలుగా బరి తెగింపు చర్యలకు పూనుకుంది. చివరకు అజెండాలోని అంశాలను సెక్రటరీ విభాగానికి చెందిన అధికారులు కాకుండా స్వయంగా మేయర్ చదివి మరీ అన్నీ ఆమోదించినట్టు ప్రకటించేశారు. సమావేశం ప్రారంభం నుంచి ప్రభుత్వ భూములను కబ్జాదారులపరం చేయవద్దంటూ.. విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకూడదంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు శాంతియుతంగా నిరసనకు దిగారు.
మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి, నేలపై పడుకుని మరీ నిరసన తెలిపారు. ఎలాగైనా సరే తమ కుటుంబ సంస్థ కబ్జా చేసిన భూములను కైవశం చేసుకోవాలన్న కుట్రతో చంద్రబాబు ప్రభుత్వం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పాలకవర్గ గడువు నెలలో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం చివరి సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతిపక్షం గొంతు నొక్కి మరీ తను అనుకున్నది సాధించుకుంది.
ఈ క్రమంలో ‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించకూడదు.. కబ్జా చేసిన భూమిని దోచి పెడతారా?’ అంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై విచక్షణా రహితంగా అధికార కూటమి పార్టీల కార్పొరేటర్లు దాడులకు దిగారు. కొందరిని మెడ పట్టుకుని నులిమారు. మరికొందరి ఛాతీపై బలంగా కొట్టారు. మహిళా కార్పొరేటర్లు అని కూడా చూడకుండా తోసివేశారు. ఇలా అన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మరీ అన్ని అంశాలకు ఆమోద ముద్ర వేసినట్టు ప్రకటించి సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు.
రౌడీలా ప్రవర్తించిన మేయర్!
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారని, కబ్జా చేసిన వారికే భూమిని అప్పగిస్తారా.. అంటూ న్యాయమైన డిమాండుతో కౌన్సిల్ సమావేశంలో నిలదీసేందుకు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో పాటు సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు కూడా నిరసనకు దిగారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కింద బైఠాయించి నిరసనకు దిగారు.
ఈ సమయంలో అజెండా నుంచి గీతం భూ కబ్జాలను సక్రమం చేసేలా పొందు పరిచిన 15వ అంశాన్ని తొలగించాలంటూ మేయర్‌కు వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడరు బాణాల శ్రీనివాసు విన్నవించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మేయర్ రెచ్చిపోయి రౌడీలా ప్రవర్తించారు. రెండు చేతులతో బలంగా శ్రీనివాసు ఛాతీని నెట్టారు. సభను హుందాగా నడపాల్సిన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఫక్తు రౌడీలా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి కిందపడిపోయారు. మేయర్ కనుసైగతో మిగిలిన కూటమి కార్పొరేటర్లు కూడా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగారు. ఇష్టారీతిలో తోసివేయడంతో పలువురి కాళ్లకు, మోచేతులకు గాయాలయ్యాయి. ముందుగానే పక్కా ప్లాన్‌తో మీడియాను అనుమతించకుండా రౌడీయిజంతో అన్ని అంశాలను ఆమోదించినట్లు ప్రకటించుకున్నారు.
పక్కా ప్లానింగ్‌తో దౌర్జన్యం
వాస్తవానికి అజెండాలో పొందు పరిచిన గీతం భూ కబ్జాలను క్రమబద్దీకరించే అంశాన్ని తొలగించాలంటూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జాలో ఉన్న వ్యక్తికే ఎలా కట్టబెడతారని నిలదీస్తున్నాయి. సమావేశంలో ఈ అంశంపై నిలదీయాలని ఆ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో పక్కా ప్లానింగ్‌తో అధికార పార్టీ సిద్ధమైంది.
ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కుటుంబ సభ్యుల వ్యవహారం కావడంతో రౌడీయిజం చేసి, మరీ ఈ అంశాన్ని ఆమోదించేందుకు సిద్ధమైంది. రౌడీయిజం బయటకు పొక్కకుండా ఉండేందుకు మీడియాను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి లేదంటూ శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమయ్యే ముందుగా జీవీఎంసీ ప్రకటన జారీ చేసింది. దీనిపై మీడియా ప్రతినిధులు మేయర్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా, వెలగపూడి తన మార్క్ రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఎవ్వడినీ అనుమతించేది లేదంటూ దురుసుగా మాట్లాడారు.
నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల ప్రవేశం
జీవీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా కౌన్సిల్ హాలులోకి పోలీసులు రంగ ప్రవేశం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ సమావేశం నుంచి ఎవరినైనా బయటకు పంపేందుకు మేయర్ నిర్ణయిస్తే, మార్షల్స్ ద్వారా వారిని సమావేశం హాలు నుంచి బయటకు పంపడం ఆనవాయితీ. అసెంబ్లీ, మండలి సమావేశాల తరహాలోనే మార్షల్స్‌కు మాత్రమే హాలులోకి అనుమతి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులను హాలులోకి అనుమతించకూడదు.
అయితే, గీతం భూముల వ్యవహారం కావడంతో నేరుగా పోలీసులు రంగ ప్రవేశం చేయడం గమనార్హం. సమావేశంలో గందరగోళం ఏర్పడిన తరుణంలో మేయర్ రెండు దఫాలు తన రూంలోకి వెళ్లి.. టీడీపీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా మార్షల్స్‌కు బదులుగా పోలీసులను కౌన్సిల్ సమావేశంలోకి పిలిచారు. ఇందుకు మేయర్ అనుమతివ్వడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పలువురు కార్పొరేటర్లు మండిపడుతున్నారు.
జీవీఎంసీ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. సాధారణంగా సెక్రటరీ విభాగానికి చెందిన ఒక ఉద్యోగి.. అజెండాలోని అంశాలను వరుస సంఖ్యలో చదివి వినిపిస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా అజెండాలోని అంశాలను తానే స్వయంగా చదవడంతో పాటు వెంటనే ఆమోదించినట్టు కూడా మేయర్ ప్రకటించారు. ఆ సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి, పల్లా, మరికొందరు కార్పొరేటర్లు అక్కడ లేకపోయినా ఆమోదించడం గమనార్హం.
మెడ పట్టుకుని తోసేస్తూ కార్పొరేటర్లపై దాడులు
గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణ విషయంలో అధికార టీడీపీ పూర్తి స్థాయిలో రౌడీయిజానికి దిగింది. కార్పొరేటర్లపై దాడులు చేయడంతో పాటు ఏకంగా గొంతు పట్టుకుని బెదిరింపులకు దిగింది. వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావును స్వయంగా మేయర్.. మెడ పట్టుకుని తోసివేశారు. అధికార పార్టీ కార్పొరేటర్లు చేసిన దాడిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బల్లా లక్ష్మణ రావు కాలికి గాయాలయ్యాయి. డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్‌పై టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ దౌర్జన్యానికి దిగారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు రేయి వెంకటరమణ, చెన్నా జానకీరామ్, సాడి పద్మారెడ్డి, పీవీ సురేష్, కోరుకొండ స్వాతిదాస్‌లపై కూడా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ మెడను కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గట్టిగా పట్టేసుకున్నాడు. వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడరు అల్లు శంకర్‌రావు మోచేతికి బలంగా గాయాలయ్యాయి.


