సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు ప్రారంభించారు. దీక్షలో గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మజ్జి చిన శ్రీను, వాసుపల్లి గణేష్ కుమార్, ధర్మశ్రీ, పసుపులేటి బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. నిరసన దీక్ష అనంతరం గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు.
గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూములను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోనుంది. గీతంకు భూ కేటాయింపుపై పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగింది. గీతంకు భూ కేటాయింపు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. జీవీఎంసీ కౌన్సిల్‌లో అడ్డదారిలో ఆమోదించే ప్రక్రియను వైఎస్సార్‌సీపీ అడ్డుకోనుంది. భూకబ్జాకు పాల్పడిన ఎంపీ భరత్‌ను అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.

చంద్రబాబు కుటుంబ సభ్యులు.. భూ దోపిడీకి తెర తీశారని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండా నుంచి గీతం భూ దోపిడీ అంశాన్ని వెనక్కు తీసుకోవాలని కోరాం. వెనక్కు తీసుకుంటే సరి.. లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.
ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. అతి పెద్ద భూ కబ్జాను అడ్డుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది చంద్రబాబు కుటుంబ సభ్యుడు.. ఎంపీ భరత్ రూ.5 వేల కోట్ల భూ దోపిడీ చేశారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గీతం సంస్థ భూ కబ్జా చేస్తుంది. గీతం భూ కబ్జాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కన్నబాబు అన్నారు.

వామపక్షాల నిరసన..
జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గీతం భూ దోపిడీని అడ్డుకోవాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు ఎంపీగా ఉండి భూ ఆక్రమణకు పాల్పడటం ఏంటని నేతలు ప్రశ్నించింది.


