కలసి నడుద్దాం

CPI and CPM held a huge meeting on April 9 - Sakshi

ఎన్నికల్లో ఉమ్మడి పోరుకు కామ్రేడ్లు సిద్ధం

ఏప్రిల్‌ 9న సీపీఐ, సీపీఎం భారీ సభ

జాతీయ నేతలకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్‌లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి.

ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎంబీ భవన్‌లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్‌కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు.

ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు.

పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్‌ఎస్‌ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top