Corona Vaccine: కోవాగ్జిన్‌ స్టాక్‌ లేదు.. కోవిషీల్డ్‌కు అర్హులు లేరు!  | Covid Vaccination Process Confusion In Telangana | Sakshi
Sakshi News home page

Corona Vaccine: కోవాగ్జిన్‌ స్టాక్‌ లేదు.. కోవిషీల్డ్‌కు అర్హులు లేరు! 

May 17 2021 1:55 AM | Updated on May 17 2021 9:09 AM

Covid Vaccination Process Confusion In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గందరగోళంలో పడింది. శని, ఆదివారాల్లో టీకాల పంపిణీని నిలిపివేస్తున్నామని.. తిరిగి సోమవారం నుంచి (ఈ నెల 17 నుంచి) ప్రారంభిస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం తెలిపింది. కానీ రాష్ట్రంలో కోవాగ్జిన్‌ మొత్తంగా ఖాళీ అయిపోవడం, కేంద్రం నుంచి కొత్త స్టాకు రాకపోవడంతో.. కోవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని నిలిపివేస్తున్నట్టు ఆదివారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కోవాగ్జిన్‌ టీకాల పంపిణీపై త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొంది. ఈ లెక్కన సోమవారం నుంచి కోవాగ్జిన్‌ పంపిణీ లేనట్టే. |

కోవిషీల్డ్‌పై అయోమయం..
కోవిషీల్డ్‌ పంపిణీకి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కోవిషీల్డ్‌ రెండో డోసును 84 రోజుల (12 వారాల) తర్వాతే ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారికి మాత్రం.. పాత గడువు లెక్కన (8 నుంచి 12 వారాల మధ్య) ఇవ్వొచ్చని రాష్ట్రాలకు సూచించింది. స్లాట్‌ బుక్‌ చేసుకోని వారికి మాత్రం 84 రోజుల గడువు ముగిశాకే ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు కొత్త గడువు ప్రకారం రెండో డోసు తీసుకోవాలని భావిస్తే.. ఆ మేరకు పోర్టల్‌లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది.

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 45 ఏళ్లు దాటినవారికి రెండో డోసు టీకాల పంపిణీ మాత్రమే సాగుతోంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ముందస్తు రిజిస్ట్రేషన్‌/బుకింగ్‌ అవసరం లేదని, టీకా కేంద్రాల్లోనే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసి వ్యాక్సిన్‌ వేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు పెద్దగా ఎవరూ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేదు. ఈ లెక్కన రాష్ట్రంలో పాత గడువుతో రెండో డోసు తీసుకోవాల్సిన వారు దాదాపుగా లేరని అధికారులు చెప్తున్నారు. కొత్త గడువు (84 రోజులు) ప్రకారం మరికొన్ని రోజులపాటు రెండో డోసు వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతుందా, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, కొత్తగా తొలి డోసు పంపిణీ ప్రారంభిస్తారా? అన్న అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement