12న రాష్ట్రానికి వ్యాక్సిన్లు

Coronavirus Vaccine Will Reach January 12th To Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల తేదీని ప్రకటించడంతో రాష్ట్రంలో సన్నాహాలు మొదలయ్యాయి. పుణే నుంచి ఈనెల 12వ తేదీన రాష్ట్రానికి వ్యాక్సిన్లు రానున్నాయి. 16వ తేదీ తొలిరోజు 139 కేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమం మొదలవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాలు ఉంటాయని తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 50 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 139 కేంద్రాల్లో దాదాపు 40 సెంటర్లు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉంటాయని పేర్కొంటున్నారు. మొదటి రోజు 139 సెంటర్లలో 13,900 మందికి టీకా వేస్తారు.

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సహా మొత్తం 2.90 లక్షల మంది వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి తొలి విడతలో టీకాలు వేస్తారు. మొదటి రోజు... వచ్చే శనివారం రాష్ట్రంలోని రెండు వ్యాక్సిన్‌ కేంద్రాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటరాక్ట్‌ అవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అందులో ఒకటి గాంధీ ఆసుపత్రి కాగా, ఇంకోటి మరోచోట ఉండే అవకాశం ఉంది. తద్వారా టీకాల కార్యక్రమం ఎలా జరుగుతుందో ప్రధాని స్వయంగా తెలుసుకుంటారు. ఇదిలావుండగా కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రైరన్‌లో తలెత్తిన సాఫ్ట్‌వేర్‌ లోపాలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.  

ప్రత్యేక కార్గో విమానంలో... 
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్‌’టీకాను పుణేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్లు ఈ నెల 12వ తేదీన ప్రత్యేక కార్గో విమానంలో పుణే నుంచి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయం నుంచి నేరుగా హైదరాబాద్‌ కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ కేంద్రానికి ప్రత్యేక ఇన్సులేటెడ్‌ వాహనంలో చేరుకుంటాయి. అక్కడి నుంచి ఇన్సులేటెడ్‌ వాహనాల్లో రాష్ట్రంలోని రీజినల్‌ సెంటర్లకు టీకాలు వెళ్తాయి. అక్కడి నుంచి అన్ని జిల్లాలకు, టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది. ఆ మేరకు ప్రతీ జిల్లాకు ఒక ప్రత్యేక వాహనం కేటాయించారు.  

ఉదయం 9 గంటల నుంచి టీకా... 
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుంది. వైద్య సిబ్బంది మొత్తానికి టీకా వేయడానికి రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత మళ్లీ రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు. టీకా ఎవరెవరికి ఎప్పుడు వేస్తారో ప్రతి ఒక్కరికీ ఒక టైం స్లాట్‌ కేటాయిస్తారు. ఆ మేరకు వారి మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తారు. ఆ సమయం ప్రకారమే టీకా కేంద్రానికి రావాల్సి ఉంటుంది.  

వారానికి నాలుగు రోజులే... 
16న టీకా కార్యక్రమం ప్రారంభం అయ్యాక...    తర్వాత రోజు 17 ఆదివారం పల్స్‌  పోలియో కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మళ్లీ 18వ తేదీ నుంచి కరోనా టీకాలు వేస్తారు. పైగా వారంలో నాలుగు రోజులపాటే కరోనా టీకా వేస్తారు. బుధ, శనివారాల్లో ఇతర వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోకూడదన్న ఉద్దేశంతో ఆ రెండు రోజులు విరామం ఇచ్చారు. ఇక ఆదివారం సెలవు ప్రకటించారు. 

వైద్య సిబ్బంది తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండు వారాలు వైద్య సిబ్బందికి టీకా వేశాక... మూడు లేదా నాలుగో వారంలో ఫ్రంట్‌లైన్‌    వర్కర్లకు టీకా వేస్తామని అధికారులు వెల్లడించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల జాబితా ఇంకా తయారుకాలేదు. వారి జాబితాను ఆయా శాఖలు తయారు చేసి కేంద్రానికి పంపించిన తర్వాత, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారికి టీకాలు వేస్తారు. అనంతరం 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక రోగులకు వేస్తారు. ఆయా తేదీలు ఖరారు కావాల్సి ఉంది.      ప్రస్తుతం రాష్ట్రానికి 6.5 లక్షల డోసుల టీకాలు వస్తాయని చెబుతున్నారు.  

సర్వసన్నద్ధంగా ఉన్నాం: ఈటల  
వ్యాక్సిన్‌ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇప్పటికే డ్రైరన్‌లను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మొదటి వ్యాక్సిన్‌ తానే వేసుకుంటానని ఆయన ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top