డాక్టర్లు, టీచర్లే ఫస్ట్‌..

Corona Vaccine First Preference To Doctors And Teachers - Sakshi

కరోనా టీకా ఇచ్చే జాబితాలో వీరికి ప్రాధాన్యం

ఇతర వైద్య సిబ్బందికీ ముందుగానే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా టీకా ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా దేశంలో 20 నుంచి 25 కోట్ల మందికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రస్తుత అంచనాల ప్రకారం.. దేశ జనాభాలో దాదాపు 18 శాతం మందికి టీకా ఇచ్చే అవకాశం ఉంది. అందరికీ మొదటి విడత టీకాలు వేసే అవకాశం లేదు. కాబట్టి ప్రాధాన్యత ప్రకారం టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా తమ ప్రాధాన్యతను తెలపాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నమూనా (ఫార్మాట్‌)ను రాష్ట్రానికి పంపించినట్లు వైద్య, ఆరోగ్య వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా ప్రాధాన్య క్రమంలో గుర్తించిన రంగాల పేర్లను పంపిస్తారు. కేంద్ర లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో దాదాపు 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ మొదటి విడతలో ఇచ్చే అవకాశాలున్నాయని ఒక వైద్యాధికారి తెలిపారు. 

వైద్య రంగానికి ప్రాధాన్యత...
కరోనా వైరస్‌ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఎందరినో బలి తీసు కుంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. దీంతో అనేకమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పో యారు. ‘కరోనాకు ముందు... కరోనా తర్వాత’అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో టీకా కోసం జనం ఎదురుచూస్తున్నారు. కేంద్రం సరఫరా చేసే కరోనా టీకాను ముందుగా ఎవరికి ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. వారి అంచనా ప్రకారం ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్సులు, ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. ఇది టాప్‌ ప్రయారిటీగా చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేస్తారు. అనంతరం ఉపాధ్యాయులకు  వేస్తారని తెలిసింది. ఎందుకంటే పిల్లలతో ఎక్కువగా కలిసి మెలిసి ఉండేవారు ఉపాధ్యాయులు, అధ్యాపకులే కాబట్టి వారిని రెండో ప్రాధాన్యతగా భావిస్తున్నారు. 

ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకొని...
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలను.. వైరస్‌కు ఎక్కువ ప్రభావితమయ్యే వర్గాలను గుర్తిస్తారు. సినీ రంగంలో పనిచేసే వారికి కూడా మొదటి విడతలోనే టీకా వేసే అవకాశాలున్నాయి. వ్యవసాయం తర్వాత ఐటీ, పారిశ్రామిక రంగాలు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందున వాటిల్లోని ముఖ్యమైన వాటిని గుర్తిస్తారు. నిర్దేశిత టీకాల సంఖ్యను బట్టి ఆయా రంగాల్లో ఎంత మంది పనిచేస్తున్నారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. వారందరినీ మొదటి విడత టీకాకు అర్హులుగా తేల్చుతారు. అలా జాబితా రూపొందించి కేంద్రానికి పంపిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top