ఈసారీ రాములోరి భక్తులకు నిరాశే..ఎందుకంటే!

Corona Effect On Bhadrachalam Sri Rama Navami Kalyanam - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో సాధారణ భక్తులకు అనుమతి రద్దు 

ఇప్పటికే కల్యాణ టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి డబ్బు వాపస్‌ 

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటన 

భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని స్వయంగా వీక్షించాలనుకునే భక్తులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆంతరంగిక వేడుకగానే ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనటం, ఆ తర్వాత ఆలయ సిబ్బంది, అర్చకుల్లో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటం తెలిసిందే.

రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో మతాలకతీతంగా అన్ని బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించింది. వేడుకలు నిరాడంబరంగా, ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ జరుపుతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అర్చకులు, వేదపండితులు, అధికారులు, పోలీసులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు మినహా సాధారణ భక్తులకు అనుమతి ఉండే అవకాశం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ ఆంక్షలకు భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, ఇప్పటికే కల్యాణ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు డబ్బు వాపస్‌ చేస్తామని వెల్లడించారు.

ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్‌లో చర్చించారు. ఇతర దేవాలయాల్లోనూ భక్తులు కోవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూనే దర్శనాలు చేసుకోవాలని కోరారు. దేవాలయాలకు వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. అన్ని మతాల పండుగల విషయంలో కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు.

శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం 
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవ స్థానంలో ఆదివారం స్వామివారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆ తర్వాత కల్యాణంలో పాల్గొనే రుత్వికులు, వారి సతీమణులు పెళ్లి పనులకు అవసరమైన పసుపు దంచారు. అనంతరం పసుపు, అత్తరు, ఇతర సుగంధద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేశారు. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవాలను వైభవంగా జరిపించారు. కాగా, కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామివారి కల్యాణ వేడుకలను అంతరాలయంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top