ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం

Corona Danger Bell In 6 Villages, Asifabad District - Sakshi

ఆసిఫాబాద్‌: ఆరు ఊర్లను  ఉప్పెనలా ముంచింది... గడపగడపకు  రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది..‌‌‌ కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా   గిరిజనులు లేంగి ఉత్సవాన్ని ‌లింగపూర్  మండలంలోని మోతిపటార్‌లో ఘనంగా నిర్వహించారు‌‌. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు.

ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. ‌మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది  ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,‌లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ‌ప్రత్యేకంగా క్యాంపులు  వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్‌ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి ‌రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్  అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా..‌ ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా  రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది.

చదవండి: సంపూర్ణ లాక్‌డౌన్‌.. రేపటి నుంచి 1వరకు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top