షాకింగ్‌: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో.. | Corona Is Also Creating Mental Turmoil | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..

Nov 12 2020 7:33 AM | Updated on Nov 12 2020 10:40 AM

Corona Is Also Creating Mental Turmoil - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మానసికంగానూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఇది ఊపిరితిత్తులు, శ్వాసకోశ, నరాల వ్యవస్థ, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. తాజాగా మానసిక సమస్యలనూ సృష్టిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది. వైరస్‌ మెదడుపై ప్రభావం చూపడంతో పాటు నిద్రలేమి, మనోవ్యథ, కుంగుబాటు, ఒత్తిళ్లు, ఆదుర్దా, ఆందోళన, అయోమయం వంటి మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు తేల్చింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో, మరణం అంచు వరకు వెళ్లి తిరిగొచ్చిన వారి లో ఈ మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు పేర్కొంది.

అలాగే, అమెరికాలోని పలు వైద్యపరిశోధన సంస్థలు తాజాగా లక్షలాది మంది పేషెంట్ల హెల్త్‌రికార్డ్‌లు (62 వేల మంది కోవిడ్‌ పేషెంట్లతో సహా) పరిశీలించి.. మానసిక అనారోగ్య అంశాలు, సమస్యలపై లోతైన విశ్లేషణ నిర్వహించాయి. కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో 20 శాతం కంటే ఎక్కువ మందిలో 90 రోజుల్లోనే మానసిక వ్యాకులత, కుంగుబాటుతో మెదడుపై ప్రతి కూల ప్రభావాలు బయటపడినట్టు ఇవి గుర్తించాయి. ఇలాంటి అనారోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది ఆస్పత్రులకు చికిత్సకు వస్తున్నట్టు స్పష్టమైంది. ఈ వివరాలన్నీ ఇటీవల ‘లాన్సెట్‌ సైకియాట్రీ’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.    (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

అన్ని అధ్యయనాల సారమిదే..
కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి మానసిక సమస్యలున్న వారికి ఇతరులతో పోలిస్తే 65% మేర కోవిడ్‌–19 సోకే అవకాశాలెక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. కరోనా కారణంగా కలుగుతున్న మానసిక అనారోగ్యంతో కొందరిలో చిత్తవైకల్యం, మెదడు సరిగా పనిచేయకపోవడం వంటి తీవ్ర సమస్యలూ ఎదురయ్యే అవకాశాలున్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని బ్రిటన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పాల్‌ హారిసన్‌ చెబుతున్నారు. కోవిడ్‌ మహమ్మారికి సంబంధించిన ఆందోళన, భయాల వల్ల ఇలాంటి మానసిక సమస్యలు కలుగుతుండొచ్చని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ మైఖేల్‌ బ్లూమ్‌ఫీల్డ్‌ తెలిపారు. కోవిడ్‌–19 అనేది కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడం వల్ల ఇతర మానసిక సమస్యలు ఎక్కువవుతున్నాయని లండన్‌ కింగ్స్‌ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్‌ సైమన్‌ వెస్లీ అంటున్నారు.   (‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా!?)

భయమే పెద్ద సమస్య
మానసిక ఒత్తిళ్లు, కుంగుబాటుతో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువుంటుంది. కాబట్టి వైరస్‌ బారినపడే అవకాశాలెక్కువ. ఆదుర్దా, ఆందోళన, భయం, నిద్రలేమి సమస్యలతో మా వద్దకు పేషెంట్లు వస్తున్నారు. కోవిడ్‌ అంటే ముందే ఏర్పడిన భయంతో పాజిటివ్‌ అని తేలాక మరింత కుంగిపోతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమకు కరోనా వచ్చిందని, అదెక్కడ తమ ఆప్తులకు సోకుతుందోనన్న ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నాక కూడా ఆరోగ్యం క్షీణిస్తుందా? గుండెపోటు వస్తుందా? ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే కోలుకోవడం కష్టమేమో వంటి సందేహాలను వెలిబుచ్చుతున్నారు.   – డాక్టర్‌ నిశాంత్‌ వేమన, సైకియాట్రిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement