
బికనీర్: లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. దానిని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కల్గుతుంది. పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరికీ రక్షణగా సైతం నిలుస్తాయని తాజా అధ్యయనమొకటి గట్టిగా నమ్ముతోంది. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందని ఒక పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది.
ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లే»ొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్లు చెబుతున్నారు.
బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసంచేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు.
ఎలా కనిపెట్టారు?
ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనంచేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాముకాటు విరుగుడు తయారుచేస్తారు. అలా తయారుచేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటిలో యాంటీబాడీ పాళ్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రపంచస్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్, బికనీర్‌లో జరిగిన స్థాయిలో అన్నిచోట్లా పరిశోధనలు సత్ఫలితాలనిస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. భారత్‌లో ఏటా వేలాది మంది పాముకాటు కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే.