‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా!? | Coronavirus: Pfizer Vaccine will Come To India | Sakshi
Sakshi News home page

‘ఫైజర్‌’ వ్యాక్సిన్‌ భారత్‌కు వస్తుందా!?

Nov 11 2020 5:04 PM | Updated on Nov 11 2020 6:19 PM

Coronavirus:  Pfizer Vaccine will Come  To India - Sakshi

జర్మనీకి చెందిన ‘బయోఎన్‌టెక్‌’ కంపెనీతో కలిసి అమెరికా ఫైజర్‌ కంపెనీ సంయుక్తంగా ఈ కొత్త కరోనా వ్యాక్సిన్‌ను కనుగొంది.

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇంతవరకు ప్రపంచం ముంగిట్లోకి వచ్చిన పలు వ్యాక్సిన్లలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ‘ఫైజర్‌’ సోమవారం వెల్లడించిన వ్యాక్సిన్‌ అత్యుత్తమమైనదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చవరి ట్రయల్స్‌లో ఉన్న ఆ వ్యాక్సిన్‌ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ముఖ్యంగా భారత దేశానికి అందుబాటులోకి వస్తుందా, వస్తే దాని ధర ఎంత ఉండవచ్చు? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిందే. 

జర్మనీకి చెందిన ‘బయోఎన్‌టెక్‌’ కంపెనీతో కలిసి అమెరికా ఫైజర్‌ కంపెనీ సంయుక్తంగా ఈ కొత్త కరోనా వ్యాక్సిన్‌ను కనుగొంది. ఈ వ్యాక్సిన్‌ ఇంకా చివరి ట్రయల్స్‌లో ఉంది. ఈ కంపెనీలు వ్యాక్సిన్‌ పరీక్షల కోసం మొత్తం 44 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. అంతిమంగా వారిలో 22 వేల మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. మరో 22వేల మందికి ‘ప్లేస్‌బో (ఉత్తుత్తి మందు)’ ఇస్తారు. ఎవరికి ఏది ఇచ్చారో చెప్పరు. ఆ తర్వాత వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందా ? ఎలా పెరిగిందో, ఎంత పెరిగిందో శాస్త్రీయంగా అధ్యయనం చేస్తారు. అయితే నాలుగు దశలుగా వారు ఇంత వరకు జరిపిన ప్రాథమిక పరీక్షల్లో విజయం సాధించారు. 
(చదవండి : ఈ దంపతుల కృషితోనే కరోనా వ్యాక్సిన్‌)

తొలి ప్రాథమిక ట్రయల్స్‌లో భాగంగా, 32 మంది వాలంటీర్లపై, రెండో ప్రాథమిక ట్రయల్స్‌లో భాగంగా 62 మంది, మూడవ ట్రయల్స్‌లో భాగంగా  92 మందిపై, నాలుగవ ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 120 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించగా, 90 శాతం సక్సెస్‌ ఫలితాలు వచ్చాయి. తాము ఎంపిక చేసిన వాలంటీర్ల సంఖ్యనుబట్టి మరో విడత 164 మంది వాలంటీర్లపై ట్రయల్స్‌కు ఆ కంపెనీలు సిద్ధమయ్యాయి. మొత్తం అందరి మీద వ్యాక్సిన్‌ ప్రయోగాలు పూర్తయ్యాక వాలంటీర్లలో ప్రతికూల మార్పులతోపాటు సానుకూల మార్పుల డేటాను లైసెన్స్‌ అనుమతి యంత్రాంగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికా ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ నవంబర్‌ చివరి వరకు ఫైజర్‌ కంపెనీకి సమయం ఇచ్చింది.

భారీ ఎత్తున వ్యాక్సిన్‌ అన్ని సవ్యంగా జరిగితే వ్యాక్సిన్‌ డోస్‌ల ఉత్పత్తికి డిసెంబర్‌ మొదటి వారానికి అనుమతి లభించవచ్చు. ముందస్తు పెట్టుబడులతో ఒప్పందం చేసుకున్నందున మొదటి విడత వ్యాక్సిన్‌ డోస్‌లను క్రిస్మస్‌ పండుగ నాటికి బ్రిటన్‌కు అందజేయాల్సి ఉంది. నాలుగవ ట్రయల్స్‌లో 90 శాతం సక్సెస్‌ అంటే అది మామూలు విషయంకాదని, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్లపై కొనసాగుతున్న ట్రయల్స్‌లో ఎవరు ఇంత సక్సెస్‌ రేటును సాధించలేదని వెల్లోరులోసి సీఎంసీలో మైక్రోబయోలోజీ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న వైద్య శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ మీడియాకు తెలిపారు. అమెరికాలోనే ఈ వ్యాక్సిన్‌ డోస్‌కు 37 డాలర్లు (దాదాపు 2,750 రూపాయలు) పలుకుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నందున భారత్‌కు వచ్చేసరికి ధర మరింత పెరగవచ్చని ఆమె చెప్పారు. అయినప్పటికీ భారత్‌కు ఈ వ్యాక్సిన్‌ వచ్చే అవకాశమే లేదని ఆమె తేల్చి చెప్పారు. 
(చదవండి : కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్‌ పాత్ర)

ప్రధానంగా ఫెజర్‌ వ్యాక్సిన్‌ను ఆర్‌ఎన్‌ఏ (రైబోన్యూక్లియక్‌ ఆసిడ్‌)తో తయారు చేశారని, అలాంటి వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చే వ్యవస్థ ఇప్పటి వరకు భారత్‌లో లేదని, కేవలం డీఎన్‌ఏ (డీయాక్సియోరైబో న్యూక్లియక్‌ ఆసిడ్‌) నుంచి తయారు చేసిన వ్యాక్సిన్లకే భారత్‌లో అనుమతి ఉందని ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ వివరించారు. ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ డోస్‌ను ఎల్లప్పుడు మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాల్సి ఉంటుందని, అలాంటి వ్యవస్థ భారత్‌ ల్యాబుల్లో, ఆస్పత్రుల్లో లేదని ఆమె వివరించారు. ఒక్క భారత్‌కే కాదు ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లోనే ఆ వ్యవస్థ లేదని జర్మన్‌ లాజిస్టిక్స్‌ సంస్థ డీహెచ్‌ఎల్‌ కథనం. ఏదేమైనా కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ వ్యాక్సిన్‌ను కనుగొనడం శుభవార్తని, ఆర్‌ఎన్‌ఏతో తయారు చేయగలిగినప్పుడు డీఎన్‌ఏ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని గగన్‌ దీప్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement