కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్‌ పాత్ర

D Vitamins Role In Prevention Of Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారిని కట్టడి చేయడంలో ‘డీ’ విటమిన్‌ నిర్వహించే పాత్రపై తగిన పరిశోధనలు సాగించాల్సిందిగా బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు క్వీన్‌ మేరీ యూనివర్శిటీ పరిశోధకులు తాజా పరిశోధనలు సాగించారు. ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుందని తేలింది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్‌ను క్రమబద్దీకరించడంలో డీ విటమిన్‌ పాత్ర ఆమోగమని పరిశోధకులు తెలిపారు. డీ విటమిన్‌ తక్కువగా ఉండి, చర్మం తీవ్రంగా దెబ్బతిన్న 86 మంది శిశువులకు మూడు నెలల పాటు డీ విటమిన్‌ ఇవ్వగా వారి చర్మం పూర్తిగా మెరగుపడిందని వారు చెప్పారు. 

బ్రిటన్‌లో సగానికి సగం జనాభా డీ విటమిన్‌ కొరతతో బాధ పడుతున్నారు. సహజసిద్ధంగా సూర్య రశ్మితో మానవ శరీరంలో డీ విటమిన్‌ అభివృద్ధి చెందుతుంది. అయితే చలికాలంలో ఆ దేశంలో సూర్య రశ్మియే తగులక పోవడంతో వారిలో డీ విటమిన్‌ కొరత ఏర్పడుతోంది. అలాంటి వారు రోజుకు డీ 3 విటమన్‌ను 10 ఎంసీజీ ట్యాబ్లెట్‌ రూపంలో తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రతి మనిషికి రోజుకు 23 ఎంసీజీల డీ విటమిన్‌ అవసరం అవుతుందని, మనం తినే ఆహారం ద్వారా కొంత డీ విటమిన్‌ లభిస్తుంది కనుక రోజుకు 10ఎంసీజీ డీ 3 విటమిన్‌ ట్యాబ్లెట్లు సరిపోతాయని వారు చెబుతున్నారు. ద్రవరూపంలో కూడా డీ 3 విటమిన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎక్కువగా శిశువులకు ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు. 

పాల ఉత్పత్తులతోపాటు మాంసం, చేపలు, కోడి గుడ్లు, చిరు ధాన్యాల్లో డీ విటమిన్‌ ఎక్కువగా ఉంటోంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతున్న డీ విటమిన్‌ పాత్రపై మరిన్ని ప్రయోగాలను సాగించడం కోసం 5 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top