
జీఆర్‌ఎంబీ భేటీలో అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు–1980కి పూర్తి విరుద్ధం
ఎలాంటి అనుమతుల్లేకున్నా ఏపీ పనులు వేగవంతం చేసింది
సీడబ్ల్యూసీలోని టీఏసీ సమావేశాల తీర్మానాలకు సైతం ఇది విరుద్ధం
ఈ అక్రమ ప్రాజెక్టును ఏపీ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్
బనకచర్ల విషయంలో గోదావరి బోర్డు తీరును సైతం తప్పుబట్టిన వైనం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ఏపీ చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు.. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు–1980కి పూర్తి విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకున్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ వేగవంతం చేసిందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ అక్రమ ప్రాజెక్టును తక్షణమే ఏపీ విరమించుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించడం లేదని తీవ్రంగా తప్పుబట్టింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) 17వ సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. ఈ సందర్భంగా గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై వాడీవేడిగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే..
‘పోలవరం ప్రాజెక్టులో భాగంగా చెరో 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతించగా, ఇప్పటికే చెరో 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు కాల్వలను నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కుడికాల్వ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించడం ట్రిబ్యునల్ అవార్డును కాలరాయడమే. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) పలు సమావేశాల్లో చేసిన తీర్మానాలకు సైతం పూర్తి విరుద్ధం..’అని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు చేశారు..సొరంగాలు నిర్మించారు
‘ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన పల్నాడు కరువు నివారణ పథకం కింద ఇప్పటికే రూ.1000 కోట్లు విలువైన పనులు చేశారు. 20వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రెండు సొరంగాలను సైతం నిర్మించినట్టుగా సమాచార హక్కు చట్టం కింద ఏపీ ప్రభుత్వమే మాకు సమాచారం ఇచి్చంది. సత్వరమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
దీనికోసం అమరావతి జల హారతి పేరుతో కార్పొరేషన్‌ను సైతం స్థాపించింది..’అని తెలిపారు. ‘బనకచర్ల’ప్రాజెక్టు డీపీఆర్‌ను తమకు సమర్పించాలని, అనుమతులొచ్చాకే పనులు జరపాలని గోదావరి బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ చెప్పగా, డీపీఆర్ తయారీ పూర్తైన తర్వాత సమరి్పస్తామని ఏపీ ఈఎన్‌సీ బదులిచ్చారు.
గోదావరి బోర్డులో గోప్యత ఎందుకు?
‘బనకచర్ల’ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున గోదావరి జలాలను గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ అక్రమ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ..కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ ప్రతిపాదనలతో పాటు తెలంగాణ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గోదావరి బోర్డుకు తదుపరి చర్యల కోసం పంపిస్తే, ఆ వివరాలను మాకు తెలియజేయలేదు. మా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తీవ్ర నష్టాన్ని కలిగించనున్న ‘బనకచర్ల’విషయంలో గోదావరి బోర్డు పారదర్శకతను పాటించలేదు..’అని తెలంగాణ అధికారులు ధ్వజమెత్తారు. బోర్డులో సభ్యులైన తమకు ఇలాంటి విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని రాహుల్ బొజ్జా స్పష్టం చేయగా, ఆ అవసరం లేదని బోర్డు సభ్య కార్యదర్వి ఎ.అజగేషన్ వాదించారు. ఏపీ సైతం ఆయనకు మద్దతు తెలిపింది.
పెద్దవాగు మరమ్మతులకు ఓకే..
గతేడాది వర్షాలతో గండిపడిన రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకి రూ.15 కోట్లతో 5 అదనపు గేట్లను ఏర్పాటు చేసి రెండు నెలల్లోగా తాత్కాలిక మరమ్మతులు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరిచాయి.
సభ్య కార్యదర్శిపై విచారణకు త్రిసభ్య కమిటీ
గోదావరి బోర్డులో రెండు రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులను బోర్డు సభ్య కార్యదర్శి అజగేషన్ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ సమావేశంలో తెలంగాణ, ఏపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల విభాగాల చీఫ్ ఇంజనీర్లు, గోదావరి బోర్డు నుంచి మరో అధికారితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిజనిర్థారణ జరిపించాలంటూ తెలంగాణ చేసిన ప్రతిపాదనకు బోర్డు చైర్మన్ అంగీకారం తెలిపారు.
సమావేశం ఎజెండాలో బోర్డు పెట్టిన పరిపాలన, ఆర్థికపరమైన ప్రతిపాదనలతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా విబేధించాయి. 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ అమలులో భాగంగా 16 ప్రాజెక్టుల నిర్వహణను తమకి అప్పగించాలని గోదావరి బోర్డు కోరగా, రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. సమావేశంలో తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ కూడా పాల్గొన్నారు.