దుబ్బాక ఎన్నికలు: దుష్ర్పచారంపై డీజీపీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Congress Party Complaint to DGPThe Issue Of Candidate Joining TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డీజీపీ మహేందర్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్‌ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయానికి  చేరుకున్నారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ,బీజేపీలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి.  కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్‌లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయం తో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీ కి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదేవిధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్‌ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని అన్నారు. 

మరో కాంగ్రెస్‌ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి.  కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి.  అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.  ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు.

చదవండి: దుబ్బాక పోలింగ్‌: చేగుంటలో కలకలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top