
సాక్షి, మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు.
చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్‌కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి.
