కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం

Colonel Santosh Babu Awarded With Maha Vir Chakra - Sakshi

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారం ప్రకటించిన కేంద్రం

చైనా సరిహద్దుల్లో వీర మరణం పొందిన తెలుగు తేజం

సాక్షి, సూర్యాపేట: భారత్‌–చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్‌ 15న సంతోష్‌ వీరమణం పొందిన విషయం తెలిసిందే. చదవండి: (మన కనక రాజుకు పద్మశ్రీ)

తండ్రి కల నెరవేర్చిన కుమారుడు.. 
దేశ సేవ చేయాలన్న తన తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌ ఆశయాన్ని నెరవేర్చాడు సంతోష్‌బాబు. సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్‌ 1983లో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సూర్యాపేటలోని సంధ్య హై స్కూల్‌లో, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో విద్యనభ్యసించారు. పాఠశాలలో మౌర్య, గుప్తా హౌస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. నేషనల్‌ ఢిపెన్స్‌ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి వచ్చింది. బిహార్‌ 16వ బెటాలియన్‌ కామాండింగ్‌ అధికారిగా ఉన్న కల్నల్‌ సంతోష్‌బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్‌ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్‌ సంతోష్‌బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్‌బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్‌ అందజేశారు. కల్నల్‌ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top