15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ

CMD Prabhakar Rao Visited Srisailam Groundwater Power Station - Sakshi

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వెల్లడి 

త్వరలో జపాన్‌ నిపుణుల బృందం సందర్శన

నష్టం అంతంత మాత్రమే.. 

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రం పరిశీలన

సాక్షి, నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో దురదృష్టవశాత్తు ప్రాణనష్టం జరిగింది కానీ, ఆస్తి నష్టం అంతగా జరగలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ప్రమాదంలో వేల కోట్ల రూపా యల నష్టం జరిగిందనే ప్రచారంలో వాస్త వం లేదని చెప్పారు. బుధవారం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలోని ఆరు యూనిట్ల జనరేటర్లు, కంట్రోల్‌ ప్యానెల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇండోర్‌ గ్యాస్‌ సబ్‌స్టేషన్, మెయిన్‌ కంట్రోల్‌ రూంలను ఆయన పరిశీలించారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి నాయకత్వంలోని బృందంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. జపాన్‌ నుంచి నిపుణుల బృందం త్వరలో ప్లాంట్‌ను సందర్శిస్తుందని, 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగో యూనిట్‌ బాగా దెబ్బతిన్నదని, ఒకటి, రెండు, ఐదు యూనిట్లలో కొంత నష్టం జరిగిందని, ఆరో యూనిట్‌లో ప్యానల్‌ దెబ్బతిందని వివరించారు. త్వరలో వీటి పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు.  

విద్యుత్‌ ఉద్యోగల భద్రతే ముఖ్యం 
విద్యుత్‌ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ప్రభాకర్‌రావు అన్నారు. జల విద్యుత్‌ కేంద్రంలో విధులు నిర్వహించే 200 మంది సిబ్బందితో సమావేశమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇలాంటి సమయంలోనే మరింత పట్టుదలతో, గుండె నిబ్బరంతో పనిచేయాలన్నారు.  
కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు 
జల విద్యుత్‌ కేంద్రంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నాలుగంత స్తుల్లో నిండిన నీటిని మోటార్ల ద్వారా తొలగిస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల పేలిన ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌ బోర్డు, ఇతర పరికరాలను సీఎండీ పరిశీలించారు. త్వరలో 2 విద్యుత్‌ యూనిట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 
ఆరో యూనిట్‌ సీజ్‌  
శ్రీశైలం భూగర్భజల విద్యుత్‌ కేంద్రం పనులను సీఎండీ ప్రభాకర్‌రావు క్షుణ్నంగా పరిశీలించారు. దోమలపెంట నుంచి ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ ద్వారా కేంద్రంలో లైట్లను వేయించారు. నాలుగు ఫ్లోర్లలో నీళ్లు నిండటంతో మోటార్లు ఏర్పాటు చేసి ఎత్తిపోస్తున్నారు. సీఐడీ విచారణలో భాగంగా ప్రమాదం సంభవించిన ఆరో యూనిట్‌ను సీజ్‌ చేశారు. విద్యుత్‌ ఎక్కడి నుంచి ప్రసారమైందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. 
పుట్టెడు దుఃఖంలోనూ..
ఇదిలాఉండగా తన సోదరుడు శ్రీనివాసరావు మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం శ్రీశైలం భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో పర్యటించారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరా మర్శించి వారికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జెన్‌కో డైరెక్టర్లు వెంకటరాజం, అజయ్, సీఈలు ప్రభాకర్‌రావు, సురేష్, టెక్ని కల్‌ ఎస్‌ఈ హనుమాన్‌ పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top