అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు | CM Revanth: Telangana Rising Global Summit Will Highlight Cong Govt Achievements In 2-yrs | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు

Nov 23 2025 4:51 AM | Updated on Nov 23 2025 4:51 AM

CM Revanth: Telangana Rising Global Summit Will Highlight Cong Govt Achievements In 2-yrs

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు 

ఫ్యూచర్‌ సిటీలో సువిశాల ప్రాంగణం.. భారీ వేదిక 

తెలంగాణ రైజింగ్‌–2047 డాక్యుమెంట్‌కు తుది మెరుగులు 

25వ తేదీ నుంచి విభాగాల వారీగా సమీక్షలు  

గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకల్లో రెండేళ్ల విజయోత్సవాలు ప్రతిబింబించాలని సూచించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్యూచర్‌ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలన్నారు.

డిసెంబర్‌ 8వ తేదీ..తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలని చెప్పారు. 9న రెండో రోజు తెలంగాణ భవిష్యత్‌ దార్శనికత, భవిష్యత్‌ ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్‌–2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానం, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

అన్ని విభాగాలు తమ భవిష్యత్‌ లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సూచించారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వనించాలని ఆదేశించారు. వేడుకలకు వచి్చన అతిథులకు తగిన వసతి సదుపాయాలతోపాటు అత్యున్నత భద్రత కల్పించాలని కోరారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. సమ్మిట్‌కు ఏర్పాట్లలో భాగంగా 25 నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.  

3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యం 
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్‌ సమ్మిట్‌లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల 25 నుంచి వరుసగా సమీక్షిస్తానని చెప్పారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామ ని తెలిపారు.

గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ ఏర్పాట్లతోపాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్‌–2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు సూచనలతోపాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌– 2047 రూపకల్పన జరిగిందని తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్‌కు తుదిరూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement