నీటిపారుదల శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ కోసం డిజైన్ కన్సల్టెంట్ల ఎంపిక ప్రక్రియను డిసెంబర్ 5 నాటికి పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) చేసిన సిఫారసులకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాలన్నారు. జలసౌధలో నీటిపారుదల శాఖపై అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం ద్వారా అందుబాటులోకి రానున్న కొత్త ఆయకట్టు వివరాలను ప్రాజెక్టుల వారీగా అందించాలని ఆదేశించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను గడువుల్లో పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధుల మొత్తాన్ని అంచనా వేసి నివేదించాలన్నారు.
పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు ఆ తర్వాతి దశలో అనుమతులు ఇవ్వరాదని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దీని ఆధారంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయాలని ఆదేశించారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు అనుమతుల జారీ విషయంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.
సాంకేతిక సలహా సంఘం (టీఏసీ) అనుమతులు పొందిన సీతారామ, మొడికుంటవాగు, చనాకా–కొరాటా డి్రస్టిబ్యూటరీ సిస్టమ్, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సాధించి ప్రధాన మంత్రి క్రిషీ సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) కింద కేంద్ర నిధుల కోసం దరఖాస్తు చేయాలన్నారు.
రెండేళ్లలో ఎంత ఆయకట్టు వచ్చింది
తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణంలో పురోగతిని ఈ సందర్భంగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. డీపీఆర్ తయారీకి టెండర్లను పిలిచామని అధికారులు నివేదించారు. బదిలీల ద్వారా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించాల్సిన ఎజెండాను సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజాద్ హుస్సేన్ పాల్గొన్నారు.
హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాల్వలు తవ్వడానికి భూసేకరణకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అంగీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి ఉత్తమ్ నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.


