
ఇంటర్‌లో ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతోందో పరిశీలించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతి పాఠశాలలో భారీ జాతీయ జెండా ఏర్పాటుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పూర్తి చేసిన విద్యార్థి ఇంటర్‌లో ఎందుకు ఉత్తీర్ణత సాధించడం లేదో ఆలోచించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై అధ్యయనం చేయాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ పూర్తి చేసేలా చూడాలన్నారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఇంటర్‌లో ఆ శాతం గణనీయంగా తగ్గిపోతోందని చెప్పా రు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలకమైందంటూ ఈ సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి పెట్టా లని కోరారు.
బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి వరకూ విద్య అందుబాటులో ఉందని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి వరకూ ఉన్న పాఠశాలలను అధ్యయనం చేసి, ప్రభు త్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. విద్యా కమిషన్, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
ఇంటర్ విద్యపై అసెంబ్లీలో చర్చిస్తాం
యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని చెప్పారు. పా ఠశాలల నిర్మాణ ప్రక్రియ ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించా రు. ఇంటర్మీడియెట్ విద్య మెరుగుకు చర్య లు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఇంటర్‌లో విద్యార్థుల చేరిక తో పాటు వారి హాజరుపైనా దృష్టి పెట్టా లని సూచించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయా లని ఆదేశించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డిలు పాల్గొన్నారు.