దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 24న వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయభాస్కర్‌రెడ్డి గురువారం హకీంపేట్‌కు చేరుకుని, స్థల పరిశీలన చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించిన స్థలాల వివరాలను తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సభాస్థలం, హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవలే ఇక్కడ మెడికల్, నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, పశువైద్య, మహిళా డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి కేటాయించారు. వీటికి సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. వీరి వెంట ట్రైనీ కలెక్టర్ హర్‡్షచౌదర్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి ఉన్నారు.


