అభివృద్ధికి కలసిరండి | CM Revanth Reddy at Uppal Bhagayat public meeting | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి కలసిరండి

Jun 8 2026 4:07 AM | Updated on Jun 8 2026 4:07 AM

CM Revanth Reddy at Uppal Bhagayat public meeting

ఉప్పల్‌ భగాయత్‌లో జరిగిన బహిరంగసభకు హాజరైన జనం.. అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం : ఉప్పల్‌ భగాయత్‌ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోతుందా?

ఆ మేరకు అభివృద్ధి జరగాలి.. మూసీలో మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు 

కొడంగల్‌లో ఓడిపోయాక, మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు  

కిషన్‌రెడ్డి గారూ అనుమతులు తెండి.. గండపెండేరం తొడుగుతామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘మల్కాజిగిరి ఎంపీగా గెలిపించినప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నందున మీరు ఆశించిన అభివృద్ధి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు సీఎంగా ఉన్నా. రాజకీయాలకతీతంగా ఎన్ని నిధులైనా, ఎన్ని అనుమతులైనా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ, మెట్రో విస్తరణ తదితరమైనవి ఏవి కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచిస్తున్నా. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం. కావాల్సినవి అడిగి సాధించుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో ఓడిపోయాక, రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన సమయంలో మల్కాజిగిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారన్నారు. అక్కడి నుంచే సీఎం వరకు రాగలిగానన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. 

శనివారం ఉప్పల్‌ భగాయత్‌ లేఔట్‌ ఫేజ్‌–3లో మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనం, టీకేఆర్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్, ఏఓసీ సెంటర్‌ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారులు, వంద పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపనల శిలాఫలకాలను రేవంత్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ భగాయత్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్వార్థం, ఎన్నికల లబ్ధి కోసం మూడు కార్పొరేషన్లు చేశానని కొందరంటున్నారు కానీ, పరిపాలన సౌలభ్యం, అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం చేశానని తెలిపారు. క్యూర్‌ పరిధిలోని 2,100 చదరపు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న 1.34 కోట్లమంది ప్రజల సదుపాయాల కోసం జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్లుగా, అదే మాదిరిగా పోలీసు వ్యవస్థను వికేంద్రీకరించినట్లు చెప్పారు. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పదెకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిచుకుంటున్నామని, రూ. 1,511 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు.  

కనీస కనికరం ఉండొద్దా? 
‘గుజరాత్‌ అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునానది, యూపీలో గంగానది రివర్‌ఫ్రంట్‌ను మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. మనం మూసీనది ప్రక్షాళన చేయొద్దా? అని అడ్డంపడుతున్న వారిని అడుగుతున్నా’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు, 55 కి.మీ. ప్రక్షాళన చేసి మూసీని అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేసి తీరతానన్నారు. ‘న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యనున్న రివర్‌ఫ్రంట్‌ దగ్గర ఒక్కో అపార్ట్‌మెంట్‌ వందల కోట్ల విలువ ఉంది. ఇక్కడ మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. ఇక్కడ ప్రజలు నివసించడం లేదు. నల్లగొండ ప్రజలను కాలుష్యం కాటేస్తుంటే కనికరం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా’ అని చెప్పారు. ఆలేరు, భువనగిరి, ప్రాంతాల్లోని ప్రజలు కొత్తగా పెళ్లయిన వారికి గర్భధారణ సమస్యలొస్తాయని, కలుషిత నీరు, ఆహారంతో కడుపుకోతకు గురవుతారని పట్టణానికి పంపిస్తున్నారన్నారు. ఫ్లోరైడ్, మూసీ కాలుష్యం, చచ్చిన శవాల కళేబరాలు కొట్టుకువస్తుంటే, అక్కడి ప్రజలు ప్రక్షాళన చేయాలని కోరారని చెప్పారు.  

సింగపూర్, న్యూయార్క్‌తో పోటీ 
నాగోల్‌ నుంచి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లేందుకు నాగోల్‌ జంక్షన్‌– ఎల్‌బీనగర్‌ –ఒవైసీ హాస్పిటల్‌–చాంద్రాయణగుట్ట–రాజేంద్రనగర్‌–ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో విస్తరణ చేయాల్సిందేనన్నారు. అంతేకాదు, ఎల్‌బీనగర్‌ – హయత్‌నగర్‌ వరకు కూడా చేయాలన్నారు. మెట్రోను 122 కి.మీ.వరకు పొడిగించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయనగరం చేయాలని తాను ప్రయత్నిస్తుంటే, అన్ని అనుమతులొచ్చాక , ఇక్కడి నుంచి మంత్రిగా చేస్తున్నాయన పోయి పుల్లలు పెట్టి అర్ధంతరంగా ఆపారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ వచ్చినందుకు అంతర్జాతీయ నగరంగా మారిందని.. రీజినల్‌ రింగ్‌రోడ్‌ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే, ప్రపంచంలోనే పోటీపడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్‌లాంటి నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందన్నారు. అంతర్జాతీయ నగరమని చెప్పుకుంటే సరిపోదని, ఆమేరకు అభివృద్ధి జరగాలన్నారు. జెడ్పీటీసీ నుంచి తాను ఈ స్థాయికి ఎదగడానికి ఆడబ్డిలే కారణమని, తన ప్రతిసభలో వారికి ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యూర్‌–1 యాప్‌ను సీఎం ప్రారంభించారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు బండారి రాజిరెడ్డిపేరు పెట్టామని, చౌరస్తాలో విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

కిషన్‌రెడ్డి గారూ ఉపన్యాసాలు ఆపండి... 
‘హైదరాబాద్‌కు రెండో దశ మెట్రో రావాల్సిందే. ట్రిపుల్‌ ఆర్‌కు అనుమతులివ్వాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. రాష్ట్రంలో పండించిన పంటలను మొత్తం కొనాల్సిందే. వీటన్నింటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్‌ నీ సంగతి చూస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘నీ పార్టీకి నువ్వు ఎప్పుడూ పనిచేయలేదని మీ కార్యకర్తలే అంటున్నారు. మా సార్‌ బీజేపీలో ఉంటూ బీఆర్‌ఎస్‌ చెప్పింది వింటారని చెబుతున్నారు. ఇక నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? ఉపన్యాసాలు ఆపండి కిషన్‌రెడ్డి గారూ..’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా తాను కాలికి బలపం కట్టుకొని 50 సార్లు ఢిల్లీ వెళ్లినా, ఐదుసార్లు మోదీని కలిసినా ఏ అనుమతులూ రాకపోవడానికి కారణం కిషన్‌రెడ్డే అని తెలిసిందన్నారు. వీటికి అనుమతులు తీసుకురా.. లక్ష మంది సమక్షంలో ఎల్‌బీ స్టేడియంలో శాలువా కప్పి గండపెండేరం తొడుగుతామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఓసారి అంబర్‌పేటలో వారేంటో చూపించారన్నారు. ఇప్పటికైనా సహకరించాలని, లేని పక్షంలో 15 తర్వాత కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement