
శనివారం హైదరాబాద్‌లో క్రీడా పాలసీని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అభినవ్ బింద్రా, జితేందర్‌రెడ్డి, శివసేనారెడ్డి
స్పోర్ట్స్ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తాం
అందుకే కొత్త క్రీడా విధానం తీసుకొస్తున్నాం
పాలసీ అమలుకు అనుభవజ్ఞులు, నిష్ణాతులతో గవర్నింగ్ బోర్డు
పీపీపీ పద్ధతిలో కలిసి పనిచేస్తామని వెల్లడి
వివిధ క్రీడలకు సంబంధించి పలు సంస్థలతో ఎంఓయూలు
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం? అందుకే మున్ముందు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చాం’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో క్రీడా సదస్సు(స్పోర్ట్స్ కాంక్లేవ్) నిర్వహించింది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఒలింపిక్ పతక విజేతలు అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, ప్రపంచ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ అంజూ బాబీ జార్జ్, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవికాంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. పలువురు మాజీ క్రీడాకారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు
‘క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలతో కలిసి పని చేస్తాం. స్పోర్ట్ పాలసీ అమలుకు సంబంధించి పలువురు ప్రముఖులతో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై క్రీడల్లో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోరు. ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్న, నిష్ణాతులైన వారిని ఏరికోరి భాగస్వాములను చేస్తున్నాం. వారంతా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా..’అని సీఎం పేర్కొన్నారు.
మున్ముందు క్రీడలకు ప్రత్యేక బడ్జెట్
‘పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పేలవ ప్రదర్శన చూసిన తర్వాతే నాకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చాలా కాలంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ అనేదే లేదు. ఈ క్రమంలోనే కొత్త క్రీడా విధానం గురించి నిర్ణయం తీసుకున్నాం. విజన్ 2047లో క్రీడలకు ప్రత్యేక అధ్యాయం కేటాయించాం. మున్ముందు క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తాం. ఈ పాలసీ లైబ్రరీలో పడేసే కాగితం ముక్క కాదు. బంగారంతో గీసిన రేఖ లాంటిది..’అని రేవంత్ అన్నారు.
హైదరాబాద్‌కు చాన్స్ ఇవ్వమని అడిగాం..
‘1956 ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత ఫుట్‌బాల్ జట్టులో 9 మంది హైదరాబాదీలే ఉన్నారు. హైదరాబాద్‌లో గతంలో జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ క్రీడలను సమర్థంగా నిర్వహించాం. అయితే గత ప్రభుత్వం పదేళ్లు క్రీడలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్టేడియంలు ఫంక్షన్ హాళ్లుగా, సన్‌బర్న్‌లాంటి ఈవెంట్లకు వేదికలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. 2026లో ఖేలో ఇండియా నిర్వహణ హక్కులు మనకు కేటాయించాలని, 2036లో భారత్‌లో ఒలింపిక్స్ జరిగితే రెండు క్రీడాంశాలను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు.
కొరియా యూనివర్సిటీ నుంచి కోచ్‌లు
‘రాష్ట్రంలో డ్రగ్స్ వాడకంతో యువత పెడదారి పడుతోంది. అటువంటివారిని సరైన మార్గంలోకి తెచ్చేందుకు క్రీడలే తగిన మార్గమని భావిస్తున్నాం. గత ఏడాది నేను కొరియా వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వచ్చిన విషయం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడే అదే యూనివర్సిటీతో జత కట్టి కోచ్‌లను తీసుకురానున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది..’అని రేవంత్ ప్రకటించారు. సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తిలాంటి ప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇంటి స్థలం, నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వం అండగా నిలిచిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
15 మందితో గవర్నింగ్ బోర్డు
కొత్త స్పోర్ట్స్ పాలసీని సమర్థంగా నిర్వహించేందుకు 15 మందితో ప్రభుత్వం గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు మాజీ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, భైచుంగ్ భూటియా, రవికాంత్ రెడ్డి, మాజీ అధికారులు పాపారావు, ఇంజేటి శ్రీనివాస్, వ్యాపారవేత్తలు సంజీవ్ గోయెంకా, ఉపాసన కామినేని, విటా దావి, కావ్య మారన్, సి.శశిధర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
పలు సంస్థలతో ఎంఓయూలు
‘స్పోర్ట్ కాంక్లేవ్’లో భాగంగా వేర్వేరు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఫుట్‌బాల్ అకాడమీ కోసం ‘ఫిఫా’, ‘ఏఐఎఫ్‌ఎఫ్’లతో, ఒలింపిక్ వాల్యూస్ ప్రోగ్రామ్‌కు సంబంధించి అభినవ్ బింద్రాతో, షూటింగ్‌లో ప్రతిభాన్వేషణ, శిక్షణ కోసం ‘గన్ ఫర్ గ్లోరీ’అకాడమీతో, బాస్కెట్ బాల్ క్రీడలో ప్రతిభాన్వేషణ, అభివృద్ధి కోసం ‘స్పోర్ట్స్ ప్రిక్స్’సంస్థతో, క్రీడలతో పాటు చదువులో కూడా కెరీర్ మార్గనిర్దేశం చేసేలా ‘హర్ స్పోర్ట్స్ కీ చాంపియన్’సంస్థతో ఒప్పందాలు కుదిరాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేకు చెందిన ‘టెన్‌విక్’సంస్థ రాష్ట్రంలోని 50 పాఠశాలల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా కూడా ఎంఓయూ కుదిరింది.