పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్‌ | CM Revanth Reddy At Nacharam Balamrutham Plant | Sakshi
Sakshi News home page

పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్‌

Jul 8 2026 5:07 AM | Updated on Jul 8 2026 5:07 AM

CM Revanth Reddy At Nacharam Balamrutham Plant

బాలామృతం ప్యాకెట్లను పరిశీలిస్తున్న సీఎం. చిత్రంలో సీతక్క

నాచారంలో బాలామృతం ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

ఉప్పల్‌/మల్లాపూర్‌ (హైదరాబాద్‌): ‘ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడటమే కాదు ఆ ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆ­రోగ్యవంతంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పు­డే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు పేద పిల్లలకు బలమైన పౌష్టికాహారం ఇవ్వాలన్న ఆలోచనతో బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే పరిపూర్ణ తెలంగాణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తని పేర్కొన్నారు. మంగళవారం నాచారం పారిశ్రామి­కవాడలో తెలంగాణ ఫుడ్స్‌ ప్రాంగణంలో రూ.40 కోట్లతో నిర్మించిన కొత్త బాలామృతం ప్లాంట్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే..
‘మహిళా సాధికారత, శిశు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పిల్లల ఆరోగ్యం, చదువు, భవిష్యత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారు. ఆ ఆలోచనతోనే ఇందిరాగాంధీ బాలామృతాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రారంభించారు. ఇది అంచలంచెలుగా ఎదుగుతూ ఉప్పల్‌ నియోజకవర్గంలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించింది. ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రం తెలంగాణ, ఏపీకే కాదు చుట్టుపక్కల 4–5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా అభివృద్ధి చెందుతుంది. 

నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్య
నాణ్యమైన భోజనమే కాదు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్‌ స్కూళ్లకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించిన మొత్తం, తల్లిదండ్రుల కష్టమంతా విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి నర్సరీ నుంచి 12 క్లాస్‌ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్‌లో నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 

చదువు తలకెక్కాలంటే కడుపు నిండుగా ఉండాలి..
విద్య విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరుగెత్తుతుంటే సార్‌ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు. వానాకాలం చదువు అయితది. అందుకే ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం ఇవ్వాలని నిర్ణయించాం. 

పిల్లలకు మంచి భోజనం అందాలనే టీచర్లకూ లంచ్‌
పిల్లలకు మాత్రమే టిఫిన్, లంచ్‌ పెడితే, టీచర్లు తినకపోతే వాళ్లు దాన్ని పట్టించుకోరు. అందుకే లక్షా 25 వేలమంది టీచర్లకు కూడా టిఫిన్, లంచ్‌ స్కూల్లోనే ఏర్పాటు చేశాం. ఎప్పుడైతే సార్‌ అక్కడ టిఫిన్‌ తింటాడో, సార్‌ అక్కడ లంచ్‌ చేస్తాడో అప్పుడు పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్‌కు రుచి తెలుస్తది. అప్పుడు ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టే విధంగా టీచర్లు చూసుకుంటారు..’ అని సీఎం చెప్పారు.

దేశవ్యాప్తంగా బాలామృతం
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 50 ఏళ్లత తర్వాత తెలంగాణ ఫుడ్స్‌ క్రియాశీల పాత్ర పోషిస్తోందని చెప్పారు. బాలామృతం దేశ వ్యాప్తంగా సరఫరా చేసేందుకు కృషి జరుగుతోందన్నారు. దేశంలో ఇలాంటి ప్లాంట్‌లు ఎక్కడా లేవని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎంఏ ఫహీమ్, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హర్కర వేణుగోపాల్‌ రావు, టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement