అపోహలొద్దు.. పరీక్ష రాయండి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy instruction for Group-1 candidates | Sakshi
Sakshi News home page

అపోహలొద్దు.. పరీక్ష రాయండి: సీఎం రేవంత్‌

Oct 20 2024 5:03 AM | Updated on Oct 20 2024 5:03 AM

CM Revanth Reddy instruction for Group-1 candidates

గ్రూప్‌–1 అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన 

జీవో 29 విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు సైతం సమర్ధించాయి..ప్రతిపక్షాల ట్రాప్‌లో పడి బంగారం లాంటి అవకాశం వదులుకోవద్దు

పదేళ్లు గ్రూప్‌–1 వేయలేదు.. ఇప్పుడు రాజకీయాలకు మిమ్మల్ని వాడుతున్నారు.. 

ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేసులు, లాఠీచార్జీలు వద్దని పోలీసులకు సూచన

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘గ్రూప్‌–1 విషయంలో అపోహలను నమ్మొద్దు. జీవో 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు. అందరికీ న్యాయం జరగాలనే జీవో 29ను తీసుకొచ్చాం. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1ః50 ప్రకారం మెరిట్‌ ఆధారంగా మెయిన్స్‌కు సెలెక్ట్‌ చేశాం. ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు. అభ్యర్థులంతా మెయిన్స్‌ పరీక్షకు హాజరుకావాలి. లేకపోతే బంగారం లాంటి అవకాశం కోల్పో­తారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. 

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో శనివారం  నిర్వహించిన పోలీస్‌ డ్యూటీ మీట్‌–2024 ముగింపు కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్యూటీ మీట్‌ విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. అనంతరం రేవంత్‌ మాట్లా­డారు. జీవో 29 ప్రకారమే ప్రభు­త్వం గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేసిందని, మధ్యలో నిబంధనలు మారిస్తే పరీక్షలను కోర్టు రద్దు చేయొచ్చ న్నారు. తాము పరీక్ష నిర్వహిస్తున్న విధా­నాన్ని కోర్టులు సమర్థించాయని గుర్తుచేశారు.  

రాజకీయ లబ్ధి కోసమే..: గ్రూప్‌–1 విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసం వితండవాదం చేస్తున్నాయని సీఎం రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను ఉసిగొల్పి ప్రాణాలు బలిగొన్నారని, వారు మాత్రం రాజకీయంగా లబ్ధిపొంది ఉన్నత పదవులు చేపట్టారని బీఆర్‌ఎస్‌ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. 

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వనివారు.. ఇప్పుడు పిలిపించుకుని మాట్లాడుతున్నారని, ఆందోళనలు చేయిస్తున్నారని, నిరుద్యోగులు వారి ఉచ్చులో పడొద్దని సూచించారు. ఇక ఆందోళనలో పాల్గొంటున్న నిరుద్యోగులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసులను సీఎం ఆదేశించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. 

అంతర్జాతీయ స్థాయిలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌.. 
పోలీస్‌ సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేయనున్న యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్‌ తెలిపారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో దానిని ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన ఉంటుందని.. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్‌ వరకు పోలీస్‌ పిల్లలకు చదువు అందిస్తామని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో మొదటి పోలీస్‌ డ్యూటీ మీట్‌ను సిబ్బందిలో స్ఫూర్తినిచ్చేలా నిర్వహించారని ఉన్నతాధికారులను అభినందించారు. తెలంగాణ సాధన కోసం కానిస్టేబుల్‌ కిష్టయ్య చేసిన త్యాగం 4 కోట్ల మంది మరువలేనిదన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. పోలీసుల పనితీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని చెప్పారు. 

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కేసులలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని ఆదేశించారు. కాగా.. త్వరలోనే పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ కూడా నిర్వహిస్తామని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు. డ్యూటీ మీట్‌ ముగింపులో భాగంగా నిర్వహించిన డ్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement