త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్‌ | Sakshi
Sakshi News home page

త్వరలో మేడిగడ్డకు సీఎం రేవంత్‌

Published Fri, May 24 2024 12:40 AM

CM Revanth to Madigadda soon: Minister Uttam Kumar Reddy

కాళేశ్వరం బ్యారేజీలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు: మంత్రి ఉత్తమ్‌

అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం 

ఇప్పటికే పనులు ప్రారంభించామన్న అధికారులు 

రేపు బ్యారేజీలను పరిశీలించనున్న ఎన్‌జీఆర్‌ఐ బృందం 

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. వానాకాలం ప్రారంభానికి ముందే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. తాను, సీఎం రేవంత్‌రెడ్డి కలసి నాలుగైదు రోజుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సందర్శనకు వచ్చి పునరుద్ధరణ పనులను పరిశీలిస్తామని చెప్పారు.

గురువారం సచివాలయంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం) బి.నాగేంద్రరావు, మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ డైరెక్టర్‌ దేశాయ్‌లతో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో నంబర్‌ బ్లాకులోని గేట్లను పైకి ఎత్తే ప్రక్రియను ప్రారంభించామని మంత్రికి ఎల్‌అండ్‌టీ సంస్థ డైరెక్టర్‌ వివరించారు. బ్యారేజీకి గ్రౌంటింగ్‌ పూర్తి చేయడంతోపాటు ఏడో బ్లాకు పునాదుల కింద షీట్‌పైల్స్‌ వేస్తామని తెలిపారు.

తర్వాత ఏడో నంబర్‌ బ్లాకులో పగుళ్లు వచ్చిన 19, 20, 21 నంబర్‌ పియర్ల మధ్య ఉన్న గేట్లను సైతం ఎత్తుతామని వెల్లడించారు. షీట్‌పైల్స్‌ను తయారు చేయించి ఇప్పటికే బ్యారేజీ వద్దకు తెప్పించామన్నారు. ఇక సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు ఎగువ, దిగువ భాగంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయని.. చెల్లాచెదురైన సీసీ బ్లాకులను పూర్వస్థితికి చేర్చే పనులు జరుగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. 

బ్యారేజీల్లో బోర్లు వేసి పరీక్షలు.. 
జేఎస్‌ ఎడ్లబడ్కార్‌ (జియో టెక్నికల్‌ పరీక్షల నిపుణురాలు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్‌ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్‌ పాలీ (నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ నిపుణుడు)తో కూడిన సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిపుణుల బృందం గురువారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావులతో సమావేశమైంది. బ్యారేజీల పరిశీలనలో తమ దృష్టికి వచి్చన అంశాలు, వాటికి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ చేసిన ప్రతిపాదనలపై తమ సంస్థ డైరెక్టర్‌కు త్వరలో నివేదిక సమరి్పస్తామని ఈ బృందం తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు నిర్వహించనున్న జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షల కోసం బ్యారేజీల లోపల బోర్లను వేయాలని సూచించింది. బోరు రంధ్రాల నుంచి అధునాతన పరికరాల ద్వారా శబ్దాలు పంపించడం ద్వారా.. బ్యారేజీల కింద భూగర్భంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. టెస్టుల్లో భాగంగా బోర్లు వేయడం, ఇతర పనులను నీటిపారుదల శాఖే నిర్వహించాలని.. తమ నిపుణులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. 

రేపు ఎన్‌జీఆర్‌ఐ బృందం పరిశీలన 
హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసె ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) నిపుణుల బృందం శనివారం మూడు బ్యారేజీలను పరిశీలించనుంది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్, ఎన్‌జీఆర్‌ఐతోపా టు ఢిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌)తో బ్యారేజీలకు పరీక్షలు జరపాలని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.

Advertisement
 
Advertisement
 
Advertisement