మార్కెట్‌లో సీఎం కేసీఆర్‌..రందీ వడకుర్రి అంటూ.. | CM KCR Sudden Visits Ontimamidi Market | Sakshi
Sakshi News home page

అగ్రగామి మార్కెట్‌గా వంటిమామిడి

Published Thu, Jan 28 2021 8:05 AM | Last Updated on Thu, Jan 28 2021 1:31 PM

CM KCR Sudden Visits Ontimamidi Market - Sakshi

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బుధవారం మార్కెట్‌ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌యార్డులో పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు, కమీషన్‌ ఏజెంట్లతో ఆయన మాట్లాడారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూరగాయ రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా వంటిమామిడి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరముందని చెప్పారు. ప్రస్తుతమున్న స్థలానికి అదనంగా మరో 14 ఎకరాలను సేకరించి 50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్‌ ఉండేలా చూడాలని సూచించారు. అవసరమైతే ఢిల్లీ, కోల్‌కతాలోని కూరగాయల మార్కెట్లను సందర్శించి వాటికి దీటుగా వంటిమామిడిని తీర్చిదిద్దాలన్నారు. గజ్వేల్‌ ప్రాంతాన్ని ‘వెజిటబుల్‌ హబ్‌’గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

16 ప్రభుత్వ కౌంటర్లు..
ములుగు మండలం తున్కిబొల్లారం వద్ద 25 ఎకరాల భూమిని సేకరించి కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మార్కెట్లో కూరగాయల ధరలు నిలకడ లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. వంటిమామిడి మార్కెట్‌ యార్డులో ఖాళీగా ఉన్న 16 దుకాణాల్లో వెంటనే ప్రభుత్వం తరఫున కౌంటర్లు తెరిచి రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేయాలని, వీటిని కిలో రూ.14కు తగ్గకుండా రైతులకు చెల్లించాలని ఆదేశించారు. ఈ కూరగాయలను ప్రభుత్వ వసతి గృహాలకు, మెస్‌లకు, ఇతర సంస్థలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అధిక కమీషన్‌పై సీఎంకు ఫిర్యాదు
వంటిమామిడి మార్కెట్లో ఏజెంట్లు 8% కమీషన్‌ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మార్కెట్‌ సందర్శన సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను వివరించారు. 8 శాతం కమీషన్‌ వసూలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై 4 శాతం కమీషన్‌ మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. కాగా, ఆలుగడ్డ ధర గణనీయంగా పడిపోయిన తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిన్నీస్, టమాటా రైతులు కూడా తమ ఇబ్బందులను వివరించారు.


సీఎం కేసీఆర్‌ వంటిమామిడి మార్కెట్‌ యార్డును సందర్శించిన సందర్భంగా రైతులతో ముచ్చటించారు. ఆ వివరాలు..
సీఎం:  ఏం పెద్దమనిషి నీ పేరేంది? 
రైతు: మద్దికుంట కృష్ణమూర్తి. మాది తున్కిఖల్సా గ్రామం. వర్గల్‌ మండలం
సీఎం: ఏ పంటలెక్కువ సాగు చేస్తవ్‌? 
రైతు: ఆలుగడ్డ ఎక్కువ సాగు చేస్త.
సీఎం: గట్లనా.. నేను కూడా ఆలుగడ్డ సాగు చేసిన. విత్తనం ఎక్కడి నుంచి తెచ్చినవ్‌?
రైతు: ఆగ్రా నుంచి తెచ్చిన సారూ.. 50 కిలోలకు రూ.3 వేల ధర పడ్డది. పోయినసారి వెయ్యి రూపాయలకే దొరికింది.
సీఎం: అయ్యో గట్లనా.. నేను కూడా ఎక్కువ ధర పెట్టే విత్తనం కొన్న. ఆలుగడ్డ ధర ఎట్లుంది? 
రైతు: ఇన్నేండ్ల ఆలుగడ్డ సాగు లో నాకు లాసు ఎర్కలే. ఈ సారి మాత్రం లాసైతుంది సారూ.. 10 కిలోలకు రూ.80–110 అంటుండ్రు. గతంలో రూ.250 దాకా
పలికేది.
సీఎం: గంత తక్కువైందా..? అయితే లాసు కాకుండా ఏదైనా మార్గం ఆలోచిద్దాం. విత్తనాలు కూడా మీకు ఇక్కడే దొరికేటట్లు చేస్తా.
మరో రైతుతో ఇలా..
సీఎం: నీ పేరేంది? ఏం చేస్తుంటవ్‌..
రైతు: పసుల స్వామి. మాది తున్కిమక్త, వర్గల్‌ మండలం. నేను రైతును, మార్కెట్‌లో కమీషన్‌ ఏజెంటును.
సీఎం: ఆలుగడ్డ ధర ఎందుకు తగ్గింది? నీకేమైనా తెలుసా? 
రైతు: కొన్ని రోజుల దాకా ఈ మార్కెట్‌ నుంచి ఆలుగడ్డ విజయవాడ, ఖమ్మం, కర్ణాటకకు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోయాయి. ధర తగ్గింది.
సీఎం: ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది ? 
రైతు: 10 కిలోలకు రూ.90–110 మాత్రమే పలుకుతుంది సార్‌.
సీఎం: ఆలుగడ్డ ఎన్ని ఎకరాలల్ల సాగు చేసినవ్‌?
రైతు: 16 ఎకరాలల్ల చేసిన సారూ.. ఈసారి నష్టం జరిగేటట్టుంది.
సీఎం: ఏం రంది వడకుర్రి.. ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేస్తా. వంటిమామిడి మార్కెట్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం. దీనికి అనుబంధంగా తున్కిబొల్లారంలో కోల్డ్‌
స్టోరేజీని ఏర్పాటు చేస్తాం. సీజన్‌ ముందే తక్కువ ధరలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తా.
(సీఎం వీరిద్దరితోనే కాకుండా నెంటూరు గ్రామానికి చెందిన కిచ్చుగారి స్వామి, గజ్వేల్‌ మండలం బంగ్లా వెంకటాపూర్‌కు చెందిన మల్లేశంతోనూ సంభాషించారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement