ఉప్పెనలా వస్తం..కేంద్రం దిగొచ్చేదాకా పోరు:: సీఎం కేసీఆర్‌

CM KCR Speech Over Rice Procurement In TRS Maha Dharna - Sakshi

వరి వేయాలంటారా.. వద్దంటారా.. సూటిగా చెప్పాలి 

బీజేపీది రాజకీయ డ్రామా.. అబద్ధపు ప్రచారం  

వారి రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతాం 

కేసులంటే భయపడే వాళ్లం కాదు 

దేశ రైతు పోరాటాలకు టీఆర్‌ఎస్‌ నేతృత్వం వహిస్తుంది

రైతుల బాధ దేశానికి తెలియచేసేందుకే మహాధర్నా  

అన్నం పెడతామంటే అరాచకమా?  

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వ కుటిలనీతి, దుర్మార్గ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయా లని కేంద్రాన్ని పదేపదే అడుగుతున్నా పట్టించుకో వడం లేదని.. పైగా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో మహాధర్నా చేపట్టామని.. కేంద్రంపై యుద్ధానికి ఇది ఆరంభమేనని చెప్పారు.

హక్కులను కాపాడ టం కోసం ఉత్తర భారత రైతులను కలుపుకొంటామని.. కేంద్రం ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉప్పెనలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 100% ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై కేసీఆర్‌ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. రైతులను వరి పంట వేయమంటారా, వద్దంటారా స్పష్టంగా చెప్పాలని.. లేకపోతే తప్పు చేశామని ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. పంట కొనుగోలు అంశం రైతుల జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. ధర్నాలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

రైతుల బాధను దేశానికి తెలిపేందుకే..  
‘తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలతో కేంద్రం మభ్యపెడుతోంది. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఆ తర్వాత సీఎం హోదాలో నేను కేంద్రాన్ని కోరి 50 రోజులు కావస్తున్నా ఉలుకూపలుకూ లేదు. వరిసాగు వద్దని రైతులకు చెప్పడం ఇష్టం లేకున్నా.. ఒకేసారి ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే కష్టమే అయినా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరి వద్దని చెప్తున్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించకున్నా.. రాష్ట్ర బీజేపీ వరి వేయండి అని రైతులకు చెప్తూ మభ్యపెడుతోంది. మన రైతుల బాధ దేశానికి, ప్రపంచానికి తెలియచేసేందుకే మహాధర్నా చేపట్టాం. ఇదేకాదు భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్‌ఎస్‌ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతుంది.

కొనుగోలు బాధ్యత కేంద్రానిదే.. 
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చుకుని పంటలు పండిస్తు న్నాం. దేశంలో పంటలను కొనుగోలు చేసి, నిల్వచేసే బాధ్యత కేంద్రానిదే. దేశంలో ఆహార కొరతను తీర్చేలా ధాన్యం కొనుగోళ్లకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమ లు చేయకపోయినా.. కొత్త రాష్ట్రం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నాం. వరి వేయాలని కేంద్రం చెప్తే.. విత్తనాలు, ఎరువులు అన్నీ ఇచ్చి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయించాం. గత యాసంగికి సంబంధించి 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మీరు తీసుకోకపోతే మా రైతుల చుట్టూ దిష్టితీసి ఆ బియ్యాన్ని మీ బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తం. 

అబద్ధపు ప్రచారాలతో: బీజేపీ.. అడ్డగోలు అబద్ధాలతో, వాట్సా ప్, ఫేస్‌బుక్‌లో వితండ వాదాలతో వ్యక్తుల కేరక్టర్‌ దెబ్బతీసే ప్రచారాలు చేస్తూ పాలించాలని అనుకుంటోంది. సీఎం, మంత్రి పదవుల కోసం మేం భయపడే రకం కాదు. ఉద్యమ సమయం లో పదవులను చిత్తు కాగితాల్లా భావించి.. రాజీనామా చేశాం. 

బీజేపీది రాజకీయ డ్రామా..
ఉత్తర భారత్‌ రైతు ఆందో ళనలను అణిచివేస్తూ కార్లు ఎక్కించి చంపుతున్నవారు.. ఇక్కడ మన కల్లాల దగ్గర రాజకీయ డ్రామా ఆడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబ ల్‌ హంగర్‌ ఇండెక్స్‌) సర్వే లో 116 దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌ కంటే అట్టడుగున భారత్‌ 101వ స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో 12 కోట్ల రైతులు, 40 కోట్ల ఎకరాల భూమి, జీవనదులు, అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నరు. బంగారు పంటలు పండే అవకాశం ఉంది. దేశ జనాభాలో సగం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.  

ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. చిప్పపట్టుకుని, బిచ్చమెత్తుకుని బతిమిలాడితే మన సమస్యలకు పరిష్కారం దొరకదు. దేశానికి అన్నం పెడతామంటే ఇంత అరాచకమా? దేశం మూగబోతోంది. మాట్లాడితే కేసులు పెడతాం అంటున్నారు. కేసీఆర్‌ అలా భయపడే వాడే అయితే తెలంగాణ వచ్చేదే కాదు. మేం పదవుల కోసం, కేసుల కోసం భయపడేవాళ్లం కాదు.  – కేసీఆర్‌ 

రైతాంగ ఉద్యమం రగలాలి  
దేశంలో కరెంటు, నీళ్లు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడాలి. మరో పోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో కచ్చితంగా ఉద్యమ జెండా ఎగసి.. రైతాంగ ఉద్యమం రగలాలి. దానికి తెలంగాణ నాయకత్వం వహించాలి. రాజకీయం పక్కన పెడితే రణంలో టీఆర్‌ఎస్‌ను మించిన పార్టీ లేదు. దేనికీ భయపడకుండా ముందుకు సాగుతాం. గ్రామాల్లో చావు డప్పు కొడతాం.  

చెట్లకు రైతుల శవాలు వేలాడాలా?  
ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య. ధాన్యం కొనుగోలు చేయక పోతే.. రైతులు విషం తాగాలా? చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? మీ దుర్మార్గ చట్టాల కింద ప్రజలు నలిగి నాశనమవ్వాలా? ప్రధానికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. యాసంగిలో వరి పంట వేయాలా వద్దా చెప్పండి. లేదంటే మా చావు మేము చస్తాం. రెండు రోజులు వేచి చూసి యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేస్తాం. ఎందాకైనా తీసుకెళ్తాం. రాజకీయ కొట్లాటను పక్కనపెట్టి ప్రజల బతుకుదెరువు గురించి కేంద్రం సమాధానం చెప్పాలి.  

విద్వేషాలతో చిచ్చుపెడ్తున్నరు.. 
ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. అక్కర ఉన్నప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంటును వాడుకునే రాజకీయాలకు కాలం చెల్లింది. మీ సర్జికల్‌ స్రైక్‌లు, మీరు సరిహద్దులో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలయ్యాయి. ఈ దేశానికి మంచి చేసే ఉద్దేశం, ఆ సంస్కారం బీజేపీకి లేదు. ఎన్నికలొస్తే భైంసా, పాకిస్తాన్‌ వంటి సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తూ, అందులో తెలంగాణను కూడా భాగస్వామిని చేస్తోంది. ఈ దేశం ఎటుపోతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజుతో వంద మందితో ప్రారంభమైన పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తాం.  

మోదీ విధానాల వల్లే ఇలా.. 
తెలంగాణ పోరాటాలు, విప్లవాల గడ్డ. పోరాటంతోనే పరాయి పాలన విషకౌగిలి నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా ఎలా రక్షించుకోవాలో తెలంగాణకు తెలుసు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ యాత్ర చేస్తాం. ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందా అంటూ వ్యాఖ్యానించారు. 2006లో గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో మోదీ 51 గంటల ధర్నాకు కూర్చున్నారు. మోదీ విధానాల వల్లే సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది.’’   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top