మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉంది: కేసీఆర్‌

CM KCR Slams On BJP Leaders In TRS Protest Over Paddy Procurement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వేదికగా భారీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పాల్గొని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. టీఆర్ఎస్‌ నిరసన దీక్షలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తమ రాష్ట్ర రైతులు పండించే ధాన్యం ప్రధాని కొంటే సరి. కొనకపోయినా ఫర్వాలేదని అ‍న్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతునే ఉంటుందని తెలిపారు. తాము పేదవాళ్లమేమీ కాదని.. రెండు మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో తెలంగాణ మంత్రి మండలి, రైతులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాలని మండిపడ్డారు.

తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. భారత ప్రధాని మోదీని గద్దె దించే సత్తా రైతులకు ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారని ధ్వజమెత్తారు. ధర్మబద్ధమైన డిమాండుతో తామొస్తే.. పీయూష్‌ గోయల్‌ అవమానించారని మండిపడ్డారు. ఆయన పీయూష్ గోయల్ కాదని.. పీయూష్ గోల్మాల్ అని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్‌ తెలిపారు. ఈ దేశ రైతులు బిచ్చం అడగడం లేదని.. హక్కులు కోరుతున్నారని అన్నారు. కొత్త వ్యవసాయ విధానం రూపొందించాలని, దానికి తాము సహకరిస్తాని పేర్కొన్నారు. లేదంటే కేంద్ర పాలకుల్ని గద్దె దించి.. తామే కొత్త పాలసీ తయారు చేసుకుంటామని తెలిపారు. పంట మార్పిడి చేయమని కేంద్రం చెబితే, తాము గ్రామగ్రామానికి, ప్రతి రైతుకూ పంట మార్చాలని చెప్పామని గుర్తు చేశారు. 

తెలంగాణ కోసం పోరాటం చేశాం.. ఇప్పుడు దేశం కోసం చేస్తాం
టీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే, బీజేపీ హైదరాబాద్‌లో ధర్నా చేస్తోందని.. వాళ్లకు సిగ్గుందా? అని నిలదీశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా? మనసు లేదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికేవరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తామంతా రాకేశ్ టికాయత్ పోరాటానికి మద్ధతిస్తున్నాని చెప్పారు. దేశంలో తాము సృష్టించే భూకంపానికి పీయూష్ గోల్మాల్ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని మండిపడ్డారు. హిట్లర్, ముస్సోలినీ వంటి ఎందరో నేతలే మట్టికలిశారని.. మీరెంత? అని ధ్వజమెత్తారు.

వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈడీ, సీబీఐలు ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవని, తనను జైలుకు పంపుతామని అంటున్నారు. దమ్ముంటే రావాలని.. తనను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చోటామోటా కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేశామని, ఇప్పుడు దేశం కోసం చేస్తామని తెలిపారు.

నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్‌కు రెండు చేతులూ జోడించి కోరుతున్నా.. మిగతా రాష్ట్రాల్లో ఎలా ధాన్యం కొంటున్నారో తమ దగ్గర కూడా అలాగే ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తమ వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని మరింత ముందుకెళ్తామని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top