ధాన్యం ఎగుమతి చేయాలి: కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

CM KCR Meets Union Minister Piyush Goyal - Sakshi

ఆ దిశగా పరిశీలన చేయాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలసిన ముఖ్యమంత్రి

సాక్షి, న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగినందున సేకరణ విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని, ధాన్యం ఎగుమతి అంశా లను పరిశీలించాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరా రు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై సోమ వారం మధ్యాహ్నం కేసీఆర్‌ మరోసారి గోయల్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటికే వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటల సాగును రాష్ట్ర ప్రభు త్వం ప్రోత్సహించినా, 55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని కేసీఆర్‌ చెప్పారు. దీంతో రాష్ట్రంలో 145 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనా వేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో పెరిగిన దిగుబడి కారణంగా ప్రస్తుత సీజన్‌లో కనీసం 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలన్నారు. ఆదివారం చర్చల సందర్భంగా కేంద్రమంత్రి అడిగిన అదనపు సమాచారాన్ని సీఎం కేసీఆర్‌ అందించారు. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు వరి పండిస్తున్నాయని, దీంతో 4 ఏళ్లకు సరిపడ నిల్వల్ని ఇప్పటికే కేంద్రం సేకరించిందని గోయల్‌ తెలిపారు. తెలంగాణకు సేకరణ కోటాను పెంచితే, ఇతర రాష్ట్రాల నుంచి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి నట్లు సమాచారం. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. విదేశాలకు ధాన్యం ఎగుమతిపై కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి తెలిపినట్లు సమాచారం.

సమస్య పరిష్కారానికి సీఎం కృషి... 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ తెలిపారు. కేంద్రమంత్రితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ సమయంలో రైతులు పండించిన పంటను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిందలు పడాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు సాగు విస్తీర్ణం చూస్తే పరిస్థితి అర్థం అవుతుందని ఆయన చెప్పారు. శాసనసభ జరుగుతున్నా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండి.. రెండుసార్లు కేంద్రమంత్రిని కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాలు సొంతంగా విదేశీ మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేదని, అందుకే కేంద్రం ఆ అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రిని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, అధికారులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top