బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం

CM KCR Laying Foundation To Sangameshwara And Basaveshwara Projects - Sakshi

అమెరికాలా..మెరిసేలా..

దేశాన్ని అమెరికాకంటే గొప్పగా మార్చుకుందాం: కేసీఆర్‌

గొప్ప యువశక్తి, వనరులు మనకున్నాయి

ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా..

నారాయణఖేడ్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి.

రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్‌ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు.


దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు
‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్‌ నిమ్జ్‌లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్‌ తెలిపారు. 

 

మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి
    రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్‌), చంటి క్రాంతికిరణ్‌ (అందోల్‌), మాణిక్‌రావు (జహీరాబాద్‌), మదన్‌రెడ్డి (నర్సాపూర్‌), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు) తదితరులు పాల్గొన్నారు.

చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్‌ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్‌ తండా. గతంలో నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్‌ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top