Dalita Bandhu: రూ.లక్ష కోట్లయినా సరే

CM KCR Full Speech At Halia Public Meeting - Sakshi

ఆరు నూరైనా దళితబంధు అమలు చేస్తాం

గతంలో దళితులను వారి ఖర్మకు వారిని వదిలేశారు: సీఎం

నేనే మేధోమథనం చేసి ఈ పథకాన్ని రూపొందించా

దళిత బంధుతో కొందరికి గుండెదడ, మరికొందరికి బీపీ వస్తోంది

కృష్ణా జలాల్లో మన వాటా తీసుకుంటాం

సాగర్‌ ఆయకట్టులో కచ్చితంగా రెండు పంటలకు నీళ్లిస్తాం

ఏడాదిన్నరలో 15 ఎత్తిపోతలు పూర్తి చేస్తాం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా, అనేక విజయాలు సాధించినా దళిత జాతి మాత్రం వెనుకబడే ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే వారి కోసం అద్భుతమైన తెలంగాణ దళిత బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. ‘రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చు చేస్తాం. ఆరు నూరైనా దళిత బంధు అమలు చేసి తీరతాం. రాష్ట్రంలో సుమారు 16 – 17 లక్షల దళిత కుటుం బాలు ఉంటే అందులో అర్హత కలిగిన కుటుంబాలు దాదాపు 12 – 13 లక్షల వరకు ఉన్నాయి. వారం దరికీ ఇంటికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తాం.’ అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. 


నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  

వారివి ఎన్నడూ చేసిన ముఖాలు కావు
‘దళితబంధుపై కొంతమంది అపోహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. అయితదా.. పోతదా.. అంటున్నారు. వారివి చేసిన ముఖాలు కావు కాబట్టి, ఎన్నడూ చేయలేదు కాబట్టే అలా మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను వారి ఖర్మకు వారిని వదిలేశారు తప్ప.. ఎవరూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. 

పుట్టగతులుండవనే అవాకులు, చెవాకులు
దళిత బంధు పథకం తీసుకురావడంతో కేసీఆర్‌ చెబితే మొండిగా చేస్తారని ఇప్పుడు అందరికీ గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్‌ ప్రెషర్‌ వస్తోంది. దళిత బంధు అమలైతే రాజకీయంగా వారికి పుట్టగతులు ఉండవనే భయంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే గీత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకున్నాం. గీత కార్మికుల పన్ను మాఫీ చేశాం. ఇలా అనేక వర్గాల సంక్షేమం చేపడుతున్నాం.

నేనే తెచ్చా .. నేనే పర్యవేక్షిస్తా
ఇప్పుడు దళిత వర్గాల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వాస్తవానికి ఈ పథకం పెట్టమని నాకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరూ డిమాండ్‌ చేయలేదు. తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ బిడ్డగా నేనే మేథోమథనం చేసి దీనికి రూపకల్పన చేశా. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. తెలంగాణ దళితజాతి భారత దళిత జాతికే ఆదర్శంగా నిలిచేలా చేసి చూపిస్తా.

చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఊరికీ నీళ్లు ఇస్తామని చెప్పాం. 57 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తామన్నాం. రేషన్‌ కార్డులు, 24 గంటల కరెంటు ఇస్తామని కూడా చెప్పాం. ఏయే మాటలు చెప్పామో అవన్నీ ఆచరించి చూపిస్తున్నాం. గతంలోనూ తెలంగాణ తెస్తామంటే ఎవరూ నమ్మలేదు. అంతా ఇంట్లో పడుకున్నారు. సమైక్య పాలకులు సంచులు మోశారు. కానీ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, నేను చావు అంచులవరకు వెళ్లి తెలంగాణ తెచ్చి చూపించాం..’ అని కేసీఆర్‌ చెప్పారు.  


నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్‌. పక్కన మంత్రి జగదీశ్‌రెడ్డి  

కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరగొచ్చు
‘రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పాలేరు రిజర్వాయర్‌ నుంచి పెద్దదేవులపల్లి చెరువు వరకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తీసుకువచ్చే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ ఆయకట్టు సేఫ్‌గా (సురక్షితంగా) ఉంటుంది. గతంలో నీళ్లను మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే, నేనే వచ్చి 50 వేల మంది ఆయకట్టు రైతాంగంతో కలిసి సాగర్‌ కట్టపై దండోరా మోగించా. ఏది ఏమైనా కృష్ణా నుంచి మన వాటా తీసుకొని ఖచ్చితంగా సాగర్‌ ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే ఏర్పాటు చేస్తాం.

అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు
ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 7 మెడికల్‌ కళాశాలలను ఇటీవల మంజూరు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం..’ అని సీఎం తెలిపారు.  

సాగర్‌ ప్రజలు నా మాట నమ్మారు
‘సాగర్‌ నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. ప్రతిపక్షాల కుక్కిడి పురాణాలు, చెప్పుడు మాటలు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేగా భగత్‌ను గెలిపించాలని కోరా. ప్రజలు నా మాట నమ్మి అద్భుతమైన తీర్పును, ఫలితాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ తీసిపోని విధంగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రజల దీవెన ఉన్నంత కాలం అదే పద్ధతిలో ముందుకుపోతాం.   

జానారెడ్డికి గుణపాఠం చెప్పారు
రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తానంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు 20 ఏళ్లయినా చేయలేరన్నారు. రెండేళ్లలో చేస్తే తాను గులాబీ కండువా కప్పుకొని టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ కండువా కప్పుకుని పోటీచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. హాలియా పట్టణం ఉండాల్సినంత గొప్పగా లేదు. రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై మంత్రి, కలెక్టర్‌ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తారు. నేను హైదరాబాద్‌లో సమీక్షిస్తా. అవసరమైతే మరోసారి సాగర్‌కు వస్తా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

జిల్లాలో అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌
‘జిల్లాలో దాదాపు 15 ఎత్తిపోతల పథకాలను వచ్చే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేస్తా. నెల్లికల్లు లిఫ్ట్‌తో పాటు కుంకుడు చెట్టుతండా లిఫ్ట్‌ మంజూరు చేశాం. నెల్లికల్లు ద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరిస్తాం. అలాగే గుర్రంపోడు తండా లిఫ్ట్‌ను సర్వే చేసి మంజూరు చేస్తాం. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు దేశంలోనే నంబర్‌ వన్‌ అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు దామరచర్లలో రావడం జిల్లా ప్రజలకు గర్వకారణం.

పోడు భూముల సమస్య పరిష్కారానికి సిద్ధం
భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని మాట ఇచ్చా. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చా. ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 2005 కటాఫ్‌ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. నందికొండలో ఎన్‌ఎస్‌పీ క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి, ఖాళీ స్థలాల్లో సొంతగా ఇళ్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్‌ చేసి హక్కు పత్రాలు ఇస్తాం. నందికొండలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. రెడ్డి కళ్యాణ మండపానికి భూమిని కేటాయిస్తాం. బంజారా భవనం నిర్మిస్తాం..’ అని సీఎం హామీ ఇచ్చారు. నల్లగొండలో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం ప్రసంగానికి అడ్డుతగిలిన మహిళ
తిరుమలగిరి (నాగార్జునసాగర్‌): సమావేశంలో సీఎం ప్రసంగిస్తుండగా సమ్మక్క సారక్కల వన దేవతల పూజారి నాగపురి లక్ష్మీ అడ్డుతగిలారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు సమ్మక్క సారక్క దేవస్థానం వద్ద తాము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే అటవీ అధికారులు తమ గుడిసెలను కూల్చివేసి, కరెంట్‌ సరఫరా రాకుండా అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను స్టేజీ మీదకు తీసుకురావాలని సీఎం ఆదేశించినా.. పోలీసులు ఆమెను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే.. కుంకుడుచెట్టు తండాకు చెందిన ఓ గిరిజన రైతు కుంకుడుచెట్టు తండా లిప్టును ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేసీఆర్‌ చెప్పారు.
  
ఒక్కసారి చెప్పానంటే 100% అమలు
కేసీఆర్‌ ఒక్కసారి చెప్పారంటే వంద శాతం దానిని అమలు చేసి తీరుతారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పిన పనులన్నీ జరిగాయి. అవి ప్రజల ముందున్నాయి. దళిత బంధు పథకాన్ని కూడా ఆరునూరైనా అమలు చేస్తాం.

వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులు
ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చేలా బడ్జెట్‌లో పెట్టిన రూ.1,000 కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించి ప్రతి ఏటా దశల వారీగా అమలు చేస్తాం.

సాగర్‌ అభివృద్ధికి రూ.150 కోట్లు
నాగార్జునసాగర్, హాలియా అభివృద్ధికి ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తున్నాం.
వాటికి అదనంగా రూ.120 కోట్లు ఇస్తాం. మొత్తంగా రూ.150 కోట్లతో సాగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.

కేంద్రానిది వ్యతిరేక వైఖరి.. ఆంధ్రా దాదాగిరీ
కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు. ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరీ కావచ్చు. కృష్ణా నీళ్లపై వారు అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top