తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ.. మల్లు స్వరాజ్యం మృతికి సీఎం కేసీఆర్‌ సహా సంతాపాలు

CM KCR Condolence To Mallu Swarajyam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆమె మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు.

‘‘ఆనాడు.. రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు సీఎం కేసీఆర్‌. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం.. గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్న సీఎం కేసీఆర్‌.. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

► ‘‘స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది.  చివరివరకు నమ్మిన సిద్ధాంతం కొసం పని చేసిన వ్యక్తి ఆమె. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడారు. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి

► మల్లు స్వరాజ్యం.. గొప్ప నేత. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం. ఆమె మరణం తెలంగాణ కు తీరని లోటు. ఎంపీ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు

నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.  నైజాం గుండాలను తరిమికొట్టి తెలంగాణ సాయుధపోరాటంలో పోరాడిన ఆమె పోరాట పటిమ ఎందరికో ఆదర్శమని గుర్తు చేసుకున్నాయన. ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో ఆమె నిలిచారని, ప్రజా ప్రతినిధిగానూ ఆమె ఎంతో గొప్ప కార్యక్రమాలను నిర్వహించారన్నారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు గుత్తా ఒక ప్రకటనలో తెలిపారు.

 సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వేర్వేరు సిద్దాంతాలు అయినా.. పేదల పక్షాన శ్రీమతి స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతి చెబుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top