పెద్ద మనసుతో చెప్తున్నా.. బాబ్లీకి ఎత్తిపోసుకోండి

CM KCR Comments on Babli Project at Nanded Meeting - Sakshi

నాందేడ్‌ మీడియా సమావేశంలో సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘గోదావరి నది నుంచి మన కళ్ల ముందే రెండున్నర వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. సమస్యను అర్థం చేసుకునే శక్తి ఉంటే పార్టీలు, ప్రభుత్వాలుగా విడిపోకుండా పరిష్కరించుకుని వాడుకోవచ్చు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు సామర్ద్యం ఒక టీఎంసీ కూడా లేదు. పెద్ద మనసు చేసుకుని చెప్తున్నా తెలంగాణతో ఒప్పందం చేసుకోండి. గోదావరిలో నీటి లభ్యత ఉందనే విషయాన్ని రుజువు చేసి అవసరమైతే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి బాబ్లీ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసుకోండి’ అని ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

మహారాష్ట్ర నాందేడ్‌ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిది పదిమార్లు మహారాష్ట్రకు వచ్చి నాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. జాతీయస్థాయిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే నీటి వినియోగంలో విప్లవాత్మక ఎజెండా అమలు చేస్తామని, రాష్ట్రాల నడుమ కొట్లాటలు లేని జాతీయ విధానం తెస్తామన్నారు. అవసరానికి మించి నదీ జలాలున్న భారత్‌లో భారీ రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరముందన్నారు.

ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన
బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడంతో పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం సీట్లు రిజర్వు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఆరు నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసి 33 శాతం సీట్లు పెంచి మహిళలకు ప్రత్యేకిస్తామన్నారు. రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనపై తమ పార్టీ విధానాన్ని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. గుణాత్మక అభివృద్ధి కోసం భిన్న ఆలోచనతో దేశ ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే బీఆర్‌ఎస్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ ప్రకటించారు. సింగపూర్, జపాన్, మలేషియా తదితర దేశాల తరహాలçో అభివృద్ధిని పరుగులు పెట్టించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తమ పార్టీ విధానాన్ని అనుసరిస్తే రెండేళ్లలో భారత్‌ అద్భుతమైన అభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. 90 శాతం విద్యుత్‌ రంగాన్ని ప్రభుత్వ అ«ధీనంలోనే పెడతామని, రెండేళ్లలోనే దేశానికి విద్యుత్‌ వెలుగులు అందిస్తామని స్పష్టంచేశారు.

దేశంలో సంపూర్ణ పరివర్తన కోసమే...
విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు సంబంధించి తమ పార్టీ ఎజెండాపై నిపుణుల బృందం కసరత్తు చేస్తోందని కేసీఆర్‌ చెప్పారు. అన్ని రంగాల్లో సంపూర్ణ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఎల్‌ఐసీని పారిశ్రామికవేత్త అదానీకి అప్పగించడం వాస్తవం కాదని చెప్తున్న కేంద్రం.. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కేంద్రంతో ఉన్న మిత్రుత్వంతోనే అదానీ ప్రపంచంలో రెండో స్థానానికి ఎదిగాడన్నారు. మతం పేరిట దేశ ప్రజల విభజనను బీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందని తేల్చిచెప్పారు. తన తదుపరి మీడియా సమావేశం త్వరలో ఢిల్లీలో ఉంటుందని ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top