బడ్జెట్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది

CLP Leader Bhatti Vikramarka Comments On Telangana Budget 2021 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులతో కలిసి గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల పుస్తకంలా ఉంది తప్ప.. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన అభివర్ణించారు. కరోనా వల్ల ఆదాయం దెబ్బతిన్నదని ఒకవైపు చెబుతూనే.. మరోవైపు  2లక్షల 30 వేల 825 కోట్ల రూపాయలతో తో బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలని భట్టి అన్నారు.  ఎఫ్.ఆర్.బీ.ఎం. చట్టాన్ని సవరిస్తున్న సందర్భంలోనే రాబోయో మూడేళ్లలో ప్రతి ఏడాది రూ. 50 వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకొస్తోందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అవుతోందని అన్నారు.

ఇప్పటికే మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉంది..  ఇప్పుడు తెచ్చే ఒటిన్నర లక్షల కోట్ల అప్పుతో.. అది రూ 5 లక్షల కోట్లకు చేరుతుందని భట్టి మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అర్థిక లోటును రూ. 45 వేల కోట్లకుపైనే చూపించచారన్నారు. ద్రవ్యలోటును అప్పులతోనే భర్తి చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం అప్పలు భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని చెప్పారు. ప్రభుత్వం భారీగా తీసుకువచ్చిన అప్పులతో సామాన్యులకు ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమం చేయలేదని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భ్రుతి, 57 ఏళ్లకే ఇస్తానన్న ఫెన్షన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కు పనికివచ్చే కార్యాచరణ ప్రణాళికలు ఏమీ లేవని భట్టి మీడియాకు వివరించారు. ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మోసం చేసేందుకు మాత్రమే పనికి వస్తుందని అన్నారు. ప్రజల్లోనే భ్రమల్లోకి నెట్టేలా కేసఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు. 2020-21 బడ్జెట్ అంచనాలను చూస్తే.. రూ. లక్షా 43 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టి.. రివైజ్ చేసే సరికి అది కాస్తా.. రూ. లక్ష 17 వేల కోట్లకు తగ్గిందని అన్నారు.

గత ఏడాది బడ్జెట్ రూ. లక్షా 43 వేల కోట్లకే చేరలేదు.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూ. 2లక్షల 30 వేల కోట్లకు చూపించడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదని భట్టి అన్నారు. రెవెన్యూ రిసీట్స్ విషయానికి వస్తే గత ఈ ఏడాది రూ. లక్షా 76 వేల కోట్ల రూపాయలకు చూపించారు.. గత ఏడాది రివైజ్డ్ బడ్జెట్ విషయానికి వస్తే.. రూ. లక్షా 17 వేల కోట్ల కు వచ్చింది.. ఈ ఏడాది ప్రభుత్వం చూపించిన లక్షా 70 వేల కొట్ల రూపాయాల రెవెన్యూ రిసీట్స్ ఎలా వస్తాయో  ప్రభుత్వం చెప్పాలని భట్టి గట్టిగా డిమాండ్ చేశారు. నాన్ టాక్స్ రెవెన్యూ విషయానికి వస్తే.. గత ఏడాది రూ. 30 వేల కోట్లను ప్రభుత్వం చూపించింది.. అందులో కేవలం రూ. 19 వేల కోట్లు మాత్రమే వచ్చింది.. మరి ఈ ఏడాది నాన్ ట్యాక్స్ రెవెన్యూని రూ. 30 వేల కోట్లు అని బడ్జెట్ లో ప్రభుత్వం ఎలా చూపించిందో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top