అగ్రిగోల్డ్‌ నయా ‘భూ’గోతం

CID Probe Into Agrigold Sale Assets In Mahabubnagar - Sakshi

76 ఎకరాలు ఎలా విక్రయించారు?

బినామీ కంపెనీల నుంచి లావాదేవీల సంగతేంటి?

మహబూబ్‌నగర్‌లోని అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకంపై సీఐడీ నజర్‌

ఏళ్ల తర్వాత వెలుగులోకి వస్తున్న అగ్రిగోల్డ్‌ లీలలు

గత దర్యాప్తు అధికారులపై అనేక అనుమానాలు

అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ను విచారించిన సీఐడీ  

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్‌ కంపెనీకి అనుబంధ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగు సంస్థలకు చెందిన 76 ఎకరాల అమ్మకం వెలుగులోకి రావడం పెనుదుమారం రేపుతోంది. దీనిపై ఇన్నాళ్లూ దర్యాప్తు చేసిన అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించిన తీరే కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. బినామీ కంపెనీలుగా ఉన్న కంపెనీలకు చెందిన ఎకరాల కొద్దీ భూమిని ఓ మామూలు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అమ్మకం చేయగా మాజీ కానిస్టేబుల్‌ కొనుగోలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నట్లు తెలుస్తోంది. 

అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ను విచారించిన సీఐడీ.. 
అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావును శుక్రవారం సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ జిల్లా, ఫరూక్‌నగర్‌ మండలంలో ఉన్న అగ్రిగోల్డ్‌ బినామీ కంపెనీలుగా సీఐడీ భావిస్తున్న మోహనా గ్రోవిస్‌ ఇన్‌ఫ్రా, లియోరా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మాతంగి ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, అఖిలేంద్ర ఇన్‌ఫ్రా ఆగ్రో వెంచర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 76 ఎకరాల భూమి విక్రయ వ్యవహారంపై ప్రశ్నించినట్లు తెలిసింది.

ఈ కంపెనీల పేరిట ఉన్న భూములను రాందాస్‌ అనే వ్యక్తి ఏ అధికారంతో విక్రయించారో చెప్పాలని ప్రశ్నించినట్లు సమాచారం. సంబంధిత కంపెనీల డైరెక్టర్లు రాందాస్‌కు అధికారం ఇచ్చి ఉంటారా అనే విషయం తెలియదని అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అగ్రిగోల్డ్‌ ప్రధాన కంపెనీల నుంచి బినామీ కంపెనీల్లోకి జరిగిన లావాదేవీల పూర్తి వివరాలు అందించాలని కోరగా ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులు డాక్యుమెంట్లు సీజ్‌ చేశారని ఆయన సమాధానమిచ్చినట్లు తెలియవచ్చింది. 

అటాచ్‌ ప్రాపర్టీ విక్రయం ఎలా? 
అగ్రిగోల్డ్‌కు చెందిన 80 కంపెనీలతోపాటు బినామీ కంపెనీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 70 కంపెనీలకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగాలు అటాచ్‌ చేస్తూ గతంలోనే ఉత్తర్వులిచ్చాయి. అయితే మహబూబ్‌నగర్‌కు చెందిన ఆస్తులు తెలంగాణ పోలీస్‌ శాఖ ఆటాచ్‌ చేసిన జాబితాలో లేవు. ఈ వ్యవహారంపై రామారావును సీఐడీ అధికారులు ప్రశ్నించగా గతంలోనే ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఈ ఆస్తులను అటాచ్‌ చేసి ఉంటుందని, వాటిని ఎలా విక్రయించారో తనకు తెలియదని, 2016లో ఈ రిజిస్ట్రేషన్‌ జరిగినప్పుడు తాను జైల్లో ఉన్నట్లు రామారావు బదులిచ్చినట్లు సమాచారం. 

హైకోర్టులో అఫిడవిట్‌.. 
ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ కానిస్టేబుల్‌ కొనుగోలు చేయడంపై గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారి హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించినట్లు తెలిసింది. మాజీ కానిస్టేబుల్‌ అగ్రిగోల్డ్‌కు బినామీగా వ్యవహ రించినట్లు ఆ అధికారి కోర్టు తెలిపారని తెలిసింది. అయితే దర్యాప్తు సమయంలో ఈ బినామీ కంపెనీలకు చెందిన ఆస్తులను గుర్తించడంతోపాటు విక్రయాలు జరిగాయా లేదా అనే అంశాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారన్న విషయంపై ఇప్పుడు సీఐడీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆ దర్యాప్తు అధికారిని సీఐడీ వెంటనే పక్కనపెట్టి మరో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో ఈ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా కొనగసాగుతున్నట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top