
డిగ్రీ ఫిజిక్స్ సిలబస్‌లో మార్పులు
ఏఐతో అనుసంధానం చేసే చాప్టర్స్
వైద్య రంగంలో విద్యార్థులను నిలబెట్టేలా సిలబస్
ఆమోదం తెలిపిన వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఇక నుంచి కేన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. హృద్రోగ చికిత్సలో ఎలక్ట్రికల్ వేవ్స్ మెకానిజం అందించబోతున్నాడు. బీఎస్సీ డిగ్రీ చేసిన విద్యార్థులే వైద్య రంగంలోని టెక్నికల్ విభాగంలో చక్రం తిప్పే వీలుంది. ఈ దిశగా డిగ్రీలో ఫిజిక్స్ పాత్రను తీర్చిదిద్దుతున్నారు. సిలబస్ మార్పుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ నేతృత్వంలోని కమిటీ కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. మారిన సిలబస్‌కు మంగళవారం మండలిలో జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు.
ఇక నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఫిజిక్స్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. పాత చాప్టర్లన్నీ నవీకరించి అందించబోతున్నారు. ప్రతి చాప్టర్‌లోనూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను తీసుకొచ్చారు. డిజిటల్ విధానాలను ఇందులో జోడించారు. తరగతి బోధనే కాకుండా, అనుభవ పూర్వకమైన విద్యా విధానం ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులు కూడా ఉపాధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేశారు.
మెకానిక్స్‌లో మజా
డిగ్రీ ఫిజిక్స్‌లో మెకానిక్స్ అండ్ ఆస్కిలేషన్స్ కీలకమైంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్య పరికరాలు పనిచేస్తున్న ఈ కాలంలో దీని ప్రాధాన్యత ఎక్కువే. ఎనర్జీ, రొటేషనల్ మోషన్, తరంగ ధైర్ఘ్యం వంటి చాప్టర్స్ ప్రధానమైనవి. న్యూటన్ లా ఆధారంగా ఉండే ఈ చాప్టర్‌ను మరింత సరళీకరించారు.
ఏఐతో పనిచేసే యంత్ర పరికరాలకు అనుగుణంగా సిలబస్‌లో ప్రాక్టికల్ వర్క్ జోడించారు. దీంతో విద్యార్థి కార్పొరేట్ వైద్య రంగంలో యంత్ర పరికరాల నిర్వహణలో మంచి ఉపాధి అవకాశాలు పొందే వీలుంది. తరంగాలు, ఎల్రక్టానిక్స్ కదలికలు వంటి మార్పులను రికార్డు చేసే రేడియేషన్ ఫిజిక్స్‌ను ఈసారి అత్యాధునిక టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ అందించబోతున్నారు.
మోడ్రన్ ఫిజిక్స్‌లో మెరుపులు
విద్యుత్ రంగంతోపాటు అత్యాధునిక లేబొరేటరీల్లో పనిచేసే యంత్ర పరికరాలకు ఆయువు పట్టు మోడ్రన్ ఫిజిక్స్. ఏఐ వచ్చిన తర్వాత అటామిక్, సబ్ అటామిక్ లెవల్స్‌ను బేరీజు వేసే విధానం పూర్తిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోడ్రన్ ఫిజిక్స్‌లో ప్రాక్టికల్ వర్క్‌ను పెంచబోతున్నారు.
అత్యాధునిక యంత్రాల్లో క్వాంటం మెకానిక్స్‌ను పరిశీలించేలా ప్రాజెక్టు వర్క్ పెంచుతున్నారు. అణు ఇంధన రంగంలో వచ్చిన మార్పులను గమనించేలా న్యూక్లియర్ ఫిజిక్స్ చాప్టర్స్, సోలార్ ఎనర్జీ ట్రాకింగ్ విధానాల చాప్టర్స్‌ను డిగ్రీలో కొత్తగా నేర్చుకునే అవకాశం ఇక నుంచి ఉండబోతోంది.
వేవ్స్, ఆప్టిక్స్‌లో వెరైటీ
ఫిజిక్స్‌లో మరో కీలకమైన చాప్టర్ వేవ్స్ అండ్ ఆప్టిక్స్ పూర్తిగా ఉపాధికి బాటలు వేసేలా ఉండాలని నిపుణులు నిర్ణయించారు. తరంగాలు వాటి గతి, ధ్వని తరంగాలు, కాంతి వేగం, కాంతిలో మార్పులు తెలిపే ఈ చాప్టర్‌ను పూర్తిగా ఇప్పుడున్న టెక్నాలజీకి అనుసంధానం చేస్తారు. తరగతిలో కేవలం బోధన సాగితే, ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం ప్రధాన కంపెనీల ద్వారా నేర్చుకునే వీలుంటుంది. ఇలాంటి అనేక మార్పులతో కూడిన ఫిజిక్స్ సిలబస్ ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది
ఉపాధి పెంచడానికే మార్పులు
సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునీకరిస్తున్నాం. నేటి తరం ఆలోచనలు, టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ రూపొందిస్తున్నాం. ఫిజిక్స్‌లో ఆధునిక వైద్య రంగానికి ఉపయోగపడే చాప్టర్లు జోడిస్తున్నాం. విద్యార్థి ప్రాక్టికల్‌గా విషయ పరిజ్ఞానం సంపాదించేలా ప్రాజెక్టు పనులు ఇవ్వబోతున్నాం.
– ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్.