Sakshi News home page

ఒక్క బీఆర్‌ఎస్‌పైనే చర్యలు అవాస్తవం 

Published Mon, Nov 27 2023 4:11 AM

CEO Vikasraj on state assembly election arrangements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క బీఆర్‌ఎస్‌ నేతలపైనే చర్యలు తీసుకుంటోందని.. ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 72 ఫిర్యాదులురాగా.. రెండు మినహా అన్నింటిపై విచారణ జరిపి, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలను పంపామని తెలిపారు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌లు సైతం నమోదు చేశామన్నారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ పాటించాలంటూ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం జారీ చేసిన అడ్వైజరీ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాల అమలు కోసం 10 రకాల అనుమతులు కోరగా, సీఈసీ 9 అనుమతులు ఇచ్చిందని, కేవలం ఒకే విజ్ఞప్తిని తిరస్కరించిందని వివరించారు.

బీఆర్‌ఎస్‌ నేత, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఏకే గోయల్‌ ఇంట్లో ఐటీశాఖ జరిపిన తనిఖీల్లో ఏమీ లభించలేదని తెలిపారు. టీ–వర్క్స్‌ ప్రభుత్వ భవనంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఘటనపై ఈసీ ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు మంత్రి కేటీఆర్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం నాటికి వివరణ అందలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 

మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్‌ 
శాసనసభ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందని.. అప్పటి నుంచి పోలింగ్‌ ముగిసేవరకు 48 గంటల పాటు సైలెన్స్‌ పీరియడ్‌ అమల్లోకి ఉంటుందని వికాస్‌రాజ్‌ చెప్పారు. ఈ సమయంలో టీవీ చానళ్లు, సోషల్‌ మీడియాలో సైతం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ఆమోదించిన ప్రకటనలను మాత్రం వార్తాపత్రికల్లో జారీ చేయవచ్చని చెప్పారు.

నిబంధనలను ఉల్లంఘించి ఎవరైన ప్రచారం చేస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వివిధ నియోజకవర్గాలకు వచ్చిన బయటి వ్యక్తులు సైలెన్స్‌ పీరియడ్‌ ప్రారంభమయ్యే సరికి వెళ్లిపోవాలన్నారు. ఎన్నికల కోసం ఈవీఎంలను సిద్ధం చేశామని, ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పోలింగ్‌ సమీపించిన నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై దాడులను మరింత ఉధృతం చేయాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించమన్నారు. 

శాసనసభ ఎన్నికల ప్రక్రియ వివరాలివీ.. 
 శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్‌ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్‌ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు.

♦  మొత్తం 49 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్‌ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 

♦ ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎౖMð్సజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్‌ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు.
​​​​​​​
♦ కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement