
హైదరాబాద్–శ్రీశైలం మార్గంలోఎలివేటెడ్ కారిడార్‌కు ఎట్టకేలకు కేంద్రం ఓకే
మన్ననూరు నుంచి పాతాళగంగ వరకునాలుగు వరుసలుగా రోడ్డు విస్తరణ
రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయం..సగం ఖర్చు భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
తీరనున్న ట్రాఫిక్ సమస్య.. రాత్రివేళల్లోవాహనాల రాకపోకలపై ఆంక్షలకూ ఇక తెర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సుమారు 32 అడుగుల ఎత్తు, 45 కి.మీ. నిడివితో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దాదాపు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని నిర్ణయించగా అందులో వన్యప్రాణులు సంచరించే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి మిగతా భాగాన్ని దానికి అప్రోచ్ రోడ్డుగా నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టుకు రూ. 7,690 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా అందులో సగం వ్యయం భరిస్తామని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సవరించిన అంచనాలను తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ. 8 వేల కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. అందులో రూ. 4 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
విస్తరణ జరగక పెరిగిన ట్రాఫిక్..
శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రోడ్డును గతంలో మన్ననూరు వరకు విస్తరించగా అక్కడి నుంచి దట్టమైన అడవి ఉండటం.. అదే మార్గంలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం కూడా ఉండటంతో రోడ్డు విస్తరణకు కేంద్రం అనుమతించలేదు. దీంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సాధారణ రోడ్డే కొనసాగుతోంది. దీనికితోడు వన్యప్రాణుల కదలికల దృష్ట్యా నిత్యం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతుండటం వల్ల ఉదయం వేళల్లో ట్రాఫిక్ పెరిగిపోతోంది. దీంతో రోడ్డు విస్తరణ తప్పనిసరైంది.
అయితే భూఉపరితలంలో విస్తరణ సాధ్యం కానందున వన్యప్రాణులకు అంతరాయం కలగని రీతిలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ఏడాదిన్నర క్రితం తెరపైకి వ చ్చింది. కానీ దాని బదులు కేబుల్ కార్ నిర్మిస్తే రూ. 2,270 కోట్లు ఖర్చవుతుందన్న ఉద్దేశంతో ఆ మేరకు ప్రతిపాదన సమర్పించా లని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. అలాగే సొరంగ మార్గం ప్రతిపాదన కూడా తెరపైకి వ చ్చింది. ఎట్టకేలకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇ చ్చింది.
కారిడార్‌కు ఇరువైపులా ఇనుపకంచెలు, నాయిస్ బ్యారియర్లు..
వన్యప్రాణులకు ఆటంకం కలగని విధంగా ఎలివేటెడ్ కారిడార్‌ను చేస్తున్నారు. వాహనాల చప్పుడు ఎక్కువ వినిపించకుండా ఉండేందుకు, జంతువులు రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు 32 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. వాహనాలు కింద పడకుండా.. వాహనదారులు కింద ఉండే అటవీ ప్రాంతంలోకి చెత్త విసరకుండా రోడ్డుకు ఇరువైపులా ఎత్తయిన ఇనుప కంచెలు ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో వాహనాల శబ్దంతో జంతువులు ఇబ్బంది పడకుండా రోడ్డుకు ఇరువైపులా నాయిస్ బ్యారియర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.