కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ రద్దు 

cancel the kamareddy master plan - Sakshi

రైతు జేఏసీ నేతలతో మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డి పట్టణానికి ప్రతిపాదించిన మాస్టర్‌ప్లాన్‌ను వెంటనే రద్దు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్‌ శాఖ ప్రకటించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. కామారెడ్డి రైతు జేఏసీ నాయకులు శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్‌ ప్రస్తుతమున్న పాత మాస్టర్‌ప్లాన్‌ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్‌ పాలకమండలి తీర్మానించిందని, రైతులకు నష్టం జరగకుండా అండగా ఉంటామని చెప్పారు.

మాస్టర్‌ప్లాన్‌ రద్దు కోసం జరిగిన ఆందోళనలలో రైతులపై నమోదైన కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. కేసుల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ, రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేస్తున్నట్లు కేటీఆర్‌ చేసిన ప్రకటనపై కామారెడ్డి రైతు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top