
సాక్షి, హైదరాబాద్: గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పోలీసులలతో పాటు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ఫిర్యాదుతో Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై వివరణ, విచారణకు హాజరవ్వాలంటూ మహిళా కమిషన్ సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం, ఎమ్మెల్యే సుధీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాను. కావాలని నాపై రాజకీయ కక్షతో పిర్యాదు చేశారు. ఈ అంశంపై లీగల్‌గా ఫైట్ చేస్తాను’అని వ్యాఖ్యానించారు.
వివాదం నేపథ్యం ఇదే
గత నెలలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..
కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్‌ఎస్ నేతలు నిరసనకు దిగారు.దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..పీఎస్‌కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు.వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్‌కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.
ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు.