
సాక్షి, నల్గొండ: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనతో అధికార బీఆర్‌ఎస్ అమ్మతి జ్వాలలు తీవ్ర స్థాయికి చేరాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టికెట్టు ఇవ్వడంతో స్థానిక నేతలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నియమాకాన్ని వెనక్కి తీసుకోవాలిని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లో, నాయకుల్లో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది.
ఈ మేరకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఆశావాహి మన్నెం రంజిత్ యాదవ్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పనిచేసి నోముల భగత్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పార్టీ సమావేశానికి స్థానిక నేతలను ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. తండ్రి పేరుతో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు కార్యకర్తలతో ఎలా మాట్లాడాలనేది కూడా తెలియదని విమర్శించారు.
నియోజకవర్గంలోని గ్రామ గ్రామల్లో కొట్లాటలు జరుగుతున్నాయని, సమస్యలను పరిష్కరించడంలో నోముల భగత్ విఫలమయ్యారని అన్నారు. ఆయన వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. భగత్‌ను కాకుండా స్థానిక వ్యక్తికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. భగత్‌ను మార్చకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెడతామని ముక్తకంఠంతో తెలిపారు.