
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ బీసీ నేతల భేటీ
కామారెడ్డి డిక్లరేషన్అమలుకు ఒత్తిడి చేయాలని నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సభలు నిర్వహించాలనే యోచన
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచాలని బీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న కరీంనగర్ వేదికగా ‘బీసీ సభ’నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 8న కరీంనగర్‌లో బీసీ సభ నిర్వహిస్తామని ప్రకటించినా తక్కువ సమయంలో భారీ సభ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో 14వ తేదీకి వాయిదా వేసింది.
ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ బీసీ కీలక నేతలు గురువారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిల్చోఛ్చి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా 50 మంది ఈ భేటీలో పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరి, కేంద్రం స్పందిస్తున్న తీరుపై చర్చించారు. కేటీఆర్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. జిల్లాలవారీగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో డ్రామాలు
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు తనంతో ఆర్డినెన్స్ ఇచ్చి సంబురాలు చేసుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా ముఖ్య నేతలెవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.