బోరబండ ఇన్‌స్పెక్టర్‌పై వేటు

Borabanda Inspector Ravi Kumar Transferred For Negligence - Sakshi

హైదరాబాద్: బోరబండ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్‌పై వేటు పడింది. ఆయన్ను సిటీ కమిషనరేట్‌కే ఎటాచ్‌ చేస్తూ కొత్వాల్‌ సందీప్‌ శాండిల్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచి్చన యువకుడి హత్య కారణంగా మరో ఇన్‌స్పెక్టర్‌పై చర్యలకు కమిషనర్‌ రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

 ఎన్నికల నేపథ్యంలో ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తమ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల వంటి అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని కొత్వాల్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్లకు సంబంధించిన రికార్డులు కలిగి ఉండాలని, వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడంతో పాటు ఇన్‌స్పెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వీరిని బైండోవర్‌ చేయడంతో పాటు క్రమం తప్పకుండా కౌన్సిలింగ్‌ ఇవ్వడం, వారి ఇళ్లను సందర్శించి కదలికలపై నిఘా ఉంచడం సైతం ఇన్‌స్పెక్టర్ల బాధ్యతగా సందీప్‌ శాండిల్య స్పష్టం చేశారు. దైనందిన విధుల నేపథ్యంలో ఈ వ్యవహారాల్లో ఎస్సై సహాయం తీసుకోవాలే తప్ప పూర్తిగా వారిపై విడిచిపెట్ట కూడదని ఆదేశాలు జారీ చేశారు. 

వీటి అమలును పర్యవేక్షించడానికి ఆయన మంగళవారం నుంచి ఠాణాల తనిఖీలు ప్రారంభించారు. వెస్ట్‌జోన్‌ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోరబండ ఠాణాలో సరైన రికార్డులు లేకపోవడం, రౌడీషీటర్ల వ్యవహారం ఎస్సైలే పర్యవేక్షించడం వంటివి సందీప్‌ శాండిల్య దృష్టికి వచ్చాయి. దీంతో ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ను నిలదీసిన ఆయన రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లారా? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చి కనీసం నలుగురి ఇళ్లైనా చూపాల్సిందిగా ఆదేశించారు. 

కొత్వాల్‌ వాహనం వరకు వెళ్ళిన రవికుమార్‌ ఆ వ్యవహారాలను ఎస్సైలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్‌ శాండిల్య ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోపక్క రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని కొత్వాల్‌ పదేపదే స్పష్టం చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరితో వైరాలు ఉన్నాయి? తదితర అంశాలపై కన్నేయాల్సిందిగా ప్రత్యేక విభాగాలకు ఆదేశించారు. అయితే ఎస్సార్‌నగర్‌ రౌడీషీటర్ షేక్‌ షరీఫ్‌ సోమవారం రాత్రి యువకుడు తరుణ్‌ను హత్య చేశాడు.

 ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ వీరి మధ్య వైరం ఉన్నా, పలుమార్లు ఘర్షణలు జరిగినా రౌడీషీటర్ పై నిఘా ఉంచడం, చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక విభాగాలు నిర్లక్ష్యం వహించాయని కొత్వాల్‌ భావిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన మరో ఇన్‌స్పెక్టర్‌పై వేటుకు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశం ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top