హైదరాబాద్: వేతనాలు చెల్లిస్తేనే పనులు చేస్తామని బీఎల్‌ఓలు భీష్మించడంతో సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో బోయిన్‌పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్‌నాయక్ బీఎల్‌ఓల సమావేశం ఏర్పాటు చేశారు. వేతనాలు ఇస్తేనే నోటీసులు పంపిణీ చేస్తామని బీఎల్‌ఓలు తేల్చి చెప్పారు. వేతనాలు తప్పకుండా చెల్లిస్తామని, నోటీసులు జారీ చేయాలని డీసీ డాక్‌నాయక్ చెప్పినా వారు వినలేదు.
అందరినీ తొలగించి కాంగ్రెస్ వారిని పెడతాం..
విషయం తెలియగానే మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, మర్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లోల రాజేందర్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు సమావేశానికి చేరుకొని బీఎల్‌ఓలతో చర్చించినా వినలేదు. రాజకీయ సమావేశంగా మారడంతో రచ్చరచ్చ అయింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇలా జరగలేదని కొంత మంది బీఎల్‌ఓలు అనడంతో టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏది ఉన్నా.. అధికారులు చెప్పినట్లు చేయాలని పార్టీలను వెనకేసుకు రావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు బీఆర్‌ఎస్ పార్టీ అయితే అందరినీ తొలగించి.. కాంగ్రెస్ వారిని పెడతామని, లిస్ట్ కూడా తయారు చేశాం’ అని ఆగ్రహించడంతో ఒక్కసారిగా నిశ్శబ్ధం అలుముకుంది.
బీఎల్‌ఓలు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఎన్నో ఆరోపణలున్నా... అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుంటే బీఆర్‌ఎస్ పార్టీకి వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన కలెక్టర్‌తో మాట్లాడి త్వరలో వేతనాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ తన సొంత నిధులైన రూ.1.50 లక్షలను బీఎల్‌ఓలకు పంచారు. వేతనాలు వచ్చేవరకు ఈ డబ్బులను తీసుకుని కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు.


